Pawan Kalyan Speech in Assembly :క్లాప్‌మిత్రలకు, పంచాయతీల్లో పనిచేసేవారికి జీతాల్లేవని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అందక విద్యార్థులు నలిగిపోతున్నారని చెప్పారు. రాష్ట్ర ఖజానాలో సొమ్ములేదని, కానీ నాసిరకం మద్యం ద్వారా కోట్లమంది జీవితాలతో ఆడుకున్న మాజీ సీఎం జగన్, ఆయన బృందం చేతుల్లోకి రూ.30,000ల కోట్లు వెళ్లిపోయాయని ఆరోపించారు. అలాంటివారిని స్వేచ్ఛగా వదిలేస్తే ఎలా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.
White Paper on Excise Department : ఒక చిన్నపాటి ఉద్యోగి లంచం తీసుకుంటే ఏసీబీ కేసు, శాఖాపరమైన విచారణ చేయిస్తున్నామని పవన్ కల్యాణ్ అన్నారు. అలాంటిది రాష్ట్ర ఖజానాకు రూ.వేల కోట్ల నష్టం కలిగించిన జగన్, ఇతరులు శిక్ష పడకుండా ఎలా తప్పించుకుంటారని ప్రశ్నించారు. దాన్ని పగ, ప్రతీకారం అనే కోణంలో చూడకూడదని స్పష్టం చేశారు. రూ.వేల కోట్లు దోచుకున్నవాళ్లను వదిలేస్తే, ఉద్యోగులు, ప్రజలకు మనం నైతికంగా ఎలాంటి బలాన్ని ఇవ్వగలం? అని అన్నారు. పారదర్శక పాలన అందిస్తున్నామనే భావన వారికి కల్పించాలని పేర్కొన్నారు. మద్యం దోపిడీపై సమాధానం చెప్పాల్సి వస్తుందనే భయంతోనే వైఎస్సార్సీపీ సభ్యులు సభకు రాకుండా పారిపోయారని పవన్ కల్యాణ్ విమర్శించారు.
దోపిడీ భారీగా ఉంది - లోతైన విచారణ చేయాలి : ప్రాథమికంగా మద్యం దోపిడీ రూ.18,861 కోట్లని చెబుతున్నా, సభ్యులు చెబుతున్నట్లు రూ.30,000ల కోట్లకు పైగానే ఉంటుందని పవన్ కల్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రజలకు చేరాల్సిన ఈ సొమ్మంతా ఎటు పోయిందో లోతైన విచారణ చేసి తేల్చాలన్నారు. బడ్జెట్లో కేంద్రం ఏపీకిి రూ.15,000ల కోట్లు ఇస్తే మనమంతా ఎంతో ఆనందపడ్డామని చెప్పారు. కానీ అక్రమ మద్యం అమ్మకాల ద్వారా దోచుకున్న వాటిలో రూ.15,000ల కోట్లు ప్రభుత్వ ఖజానాకు వచ్చి ఉంటే, అమరావతి రాజధానికి ఇబ్బంది ఉండేది కాదన్నారు. పోలవరం చాలావరకు పూర్తయ్యేదని పవన్ కల్యాణ్ వెల్లడించారు.
మద్యనిషేధం చాలా కష్టం :ఏపీలో మద్యనిషేధం చాలా కష్టమని పవన్ కల్యాణ్ అన్నారు. యానాం, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా సరిహద్దులు ఉన్నాయని చెప్పారు. అందుకే అమ్మకాలను క్రమబద్ధీకరించాలన్నారు. వ్యసనాన్ని తగ్గించేందుకు కొంత బడ్జెట్ కేటాయించాలని తెలిపారు. మద్యాన్ని ఆదాయంగానే చూడకుండా, 10 శాతం నిధుల్ని డీఅడిక్షన్ కేంద్రాలకు ఇవ్వాలని పవన్ కల్యాణ్ సూచించారు.