CM Chandrababu Inspected Rushikonda Buildings in Visakha: రుషికొండ ప్యాలెస్ చూస్తుంటే గుండె చెదిరిపోయే నిజాలు బయటకు వస్తున్నాయని సీఎం చంద్రబాబు అన్నారు. ఒక సీఎం విలాసం కోసం పర్యావరణాన్ని విధ్వంసం చేసి ప్యాలెస్ కట్టుకోవడం ఎక్కడా చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రుషికొండ భవనాలను మంత్రులు, ఎమ్మెల్యేలతో కలిసి చంద్రబాబు పరిశీలించారు. ఈ భవనాలను చూస్తుంటే ఎవరూ కలలో కూడా ఊహించనిది జరిగిందని అన్నారు. ఒక వ్యక్తి విలాసవంతమైన జీవితం కోసం ఏవిధంగా కార్యక్రమాలు చేస్తాడనేది ఇక్కడి భవనాలు చూశాకే తెలిసిందని వివరించారు.
రాజులు కూడా ఇలాంటివి నిర్మించలేదు: ఈ భవనాల విషయంలో ఎన్జీటీ, హైకోర్టు, కేంద్ర ప్రభుత్వాన్ని జగన్ మభ్యపెట్టారని అన్నారు. ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని ఏ విధంగా చేయగలరో అనే దానికి ఇక్కడి పరిస్థితి ఒక ఉదాహరణ అని వివరించారు. గతంలో నేను, నా మిత్రుడు పవన్ కల్యాణ్ ఇక్కడకు రావాలని ప్రయత్నించామని కానీ ఎవరినీ రానీయకుండా చేశారని మండిపడ్డారు. ఇక్కడ ఏం జరిగిందో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని ఆ అధికారం ప్రజలే తమకు ఇచ్చారని అన్నారు. రుషికొండ బీచ్ విశాఖలోనే అత్యంత అందమైన ప్రాంతమని కొనియాడారు. భవనాల్లో ఎక్కడ కూర్చున్నా సముద్రం వ్యూ కనిపించేలా కట్టారన్నారు. పూర్వం రాజులు, చక్రవర్తులు కూడా ఇలాంటి భవనాలు నిర్మించుకోలేదని వెల్లడించారు.
భవనాలు చూసి ఆశ్చర్యం కలిగింది: ఒక వ్యక్తి తన స్వార్థం కోసం ఇలాంటి విలాసవంతమైన భవనాలు నిర్మిస్తారని ఊహించలేదని సీఎం అన్నారు. ప్రజాధనంతో ఇలాంటి భవనాలు కట్టుకోవడం దారుణమని వెల్లడించారు. ఈ భవనాలు చూసి ఆశ్చర్యం, ఉద్వేగం కలిగిందని అన్నారు. బాత్ టబ్ కోసం రూ.36 లక్షలు ఖర్చు చేశారని ఫ్యాన్సీ ఫ్యాన్లు, ఇలాంటి షాండ్లియర్లు ఎక్కడా చూడలేదని అన్నారు. అంతే కాకుండా భవనాలకు మార్బుల్స్ విదేశాల నుంచి తీసుకొచ్చారని మండిపడ్డారు. చాలా దేశాలు తిరిగాను, ఎంతో మంది నేతలను చూశాను కానీ ఎవరూ ఇలాంటి ప్యాలెస్‌లు కట్టుకోలేదని తెలిపారు. పేదలను ఆదుకుంటామనేవారు ఇలాంటివి కట్టుకుంటారా అని సీఎం ప్రశ్నించారు.
రుషులు తపస్సు చేసిన కొండకే గుండు: గత జగన్ ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు రూ.400 కోట్లు కూడా ఖర్చు చేయలేదని చంద్రబాబు విమర్శించారు. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో పనికివస్తారా ప్రజలు ఆలోచించాలని కోరారు. ఈ భవనాలు దేనికి వాడుకోవాలో అర్థం కావడం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఇక్కడ క్యాంప్ ఆఫీస్ కట్టడం ఏమిటో అర్థం కాలేదని, ప్రజలంటే ఎంతో కొంత భయం ఉంటే సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ప్రజాధనం దోచుకుని గతంలో ఊరికొక ప్యాలెస్ కట్టుకున్నారని ఆరోపించారు. అధికారంలో శాశ్వతంగా ఉంటాననే భ్రమలతో ఇలాంటివి కట్టారని విశాఖ ప్రజలను మోసం చేసేందుకు ఇలాంటి తప్పుడు పనులు చేశారని చంద్రబాబు విమర్శించారు. బుుషులు తపస్సు చేసిన కొండనే గుండు చేశారని అన్నారు. ఇక్కడి 61 ఎకరాలు, కేసులు, అక్రమాలన్నీ ఆన్‌లైన్‌లో పెడతామని సీఎం స్పష్టం చేశారు.
MRPకి మించి మద్యం అమ్మితే 5 లక్షలు జరిమానా - రెండోసారి తప్పు చేస్తే లైసెన్స్ రద్దు
"జగన్ జోలికొస్తే బండికి కట్టి లాక్కుపోతా" - పరారీలో కొందరు, జైళ్ల భయంతో ఎందరో!