AP JAC Chairman Bopparaju Venkateswarlu : గత ప్రభుత్వం ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులు పెట్టిందని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. గతంలో 10, 15 తేదీల్లో జీతాలు అందేవని ఇప్పుడు ఆ పరిస్థితి లేదని అన్నారు. గత ప్రభుత్వం మధ్యంతర భృతిని ప్రకటించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వమైనా మధ్యంతర భృతిని ప్రకటించాలని కోరారు. విజయవాడ రెవెన్యూ భవన్లో జరిగిన ఏపీ జేఏసీ అమరావతి సెక్రటేరియట్ సమావేశం అనంతరం మీడియాతో ఆ సంఘం ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, సెక్రటరీ జనరల్ దామోదర్ మాట్లాడారు. ఉద్యోగులు అభిప్రాయాలతో కూడిన 18 అంశాలను సీఎం కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రాబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లామని ఆయన చెప్పారు.
ఉద్యోగులు కోరుకున్నట్లు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిందని, ఉద్యోగులు కొత్త ప్రభుత్వంపై కోటి ఆశలతో ఉన్నారని బొప్పరాజు వెంకటేశ్వర్లు అభిప్రాయపడ్డారు. పండుగలు వెళ్లిపోతున్నా, ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటనలు లేవని చెప్పారు. గతంలో 10, 15 తేదీల వరకు జీతాలు అందేవని, ఇప్పుడా పరిస్థితి తప్పిందని ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. మధ్యంతర భృతిని ప్రకటించకుండా గత ప్రభుత్వం వెళ్ళిపోయిందని, ప్రస్తుత ప్రభుత్వమైనా ప్రకటించాలని కోరారు. పీఆర్సీ కాల పరిమితి దాటి 15 నెలలు అయిందని, వెంటనే కమిషనర్‌ను నియమించాలని డిమాండ్ చేశారు.
'బకాయిలు అన్నీ అడగట్లేదు - పదవీ విరమణ చేసిన వారివి ముందు చెల్లించండి'
ఉద్యోగుల హెల్త్ కార్డులు పని చేయడం లేదని, ఇబ్బందులు లేకుండా క్యాష్ లెస్ వైద్య సదుపాయాన్ని కల్పించాలని ప్రభుత్వానికి బొప్పరాజు వెంకటేశ్వర్లు విన్నవించారు. ప్రభుత్వ ఉద్యోగులకు 25 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని, ప్రభుత్వం కనీసం రిటైర్డు ఉద్యోగులకు బకాయిలు చెల్లించాలని విజ్ఞాపన చేస్తున్నామని చెప్పారు. ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్ సొమ్ము బకాయిలు, పోలీసుల సిబ్బందికి సరెండర్ లీవ్ డబ్బుల్ని ఇవ్వాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్న అంశాలపై ప్రభుత్వం స్పందించాలని, తమ సమస్యలను ప్రాధాన్య క్రమంలో తీర్చాలని బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు.
ఒకటో తేదీన జీతం తీసుకోవడాన్ని నమ్మలేకపోతున్నాం: ఏపీ జేఏసీ మహిళా ఉద్యోగులు - AP JAC Women Meeting