Parliament Election Expenditure of Candidates : ఎన్నికలు అంటే చాలు భారీగా డబ్బులు ఖర్చుపెట్టందే ఓటర్లను ప్రసన్నం చేసుకోలేమనే తీరుకు నాయకులు వచ్చేశారు. ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం(Lok Sabha Polls 2024) పెద్ద ఎత్తున చేపట్టాలంటే దిగువన ఉన్న నాయకుల నుంచి డబ్బును పంచిపెట్టుకొని రావాలని కొంతమంది భావిస్తుంటారు. గ్రామ, మండల, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి నేతలంతా పైసలు ఇస్తేనే ఎన్నికల రణరంగంలోకి దిగుతామని చెప్పడంతో అందుకు అయ్యే వ్యయాన్ని అభ్యర్థే పెట్టుకోవాలని ఆయా నియోజకవర్గాల్లో స్థానికంగా ఉండే నేతలు అడుగుతున్నారు.
ఒక్కో లోక్సభ నియోజకవర్గం పరిధిలో 7 అసెంబ్లీ స్థానాలు ఉండనుండగా, దాదాపు 40 నుంచి 50 మండలాలు అందులో ఉంటున్నాయి. ఈ ఒక్కో మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యలు, సర్పంచులు, పార్టీ మండల అధ్యక్షులు, అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జిలు కలిపి వంద మందికి పైగానే ఉంటారు. ఇప్పుడు నాయకులు అంతా ప్రచారం(Election Campaign)లో చురుగ్గా పాల్గొంటేనే అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే నాలుగు నెలలు క్రితం జరిగిన ఎన్నికల్లో భారీగా డబ్బును ఖర్చు చేయడం వల్ల ఇప్పుడు డబ్బును ఖర్చు చేయడానికి ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జులు సుముఖంగా లేరని ఒక లోక్సభ అభ్యర్థి స్పష్టం చేశారు. అయితే ఒక్కో నియోజకవర్గానికి ప్రచారానికి రూ.10 కోట్లు దాకా అవసరం అవుతాయని అభ్యర్థులు అంచనా వేస్తున్నారు.
Lok Sabha Candidates Election Campaign : అయితే వచ్చే నెల 11వ తేదీ వరకు లోక్సభ ఎన్నికల ప్రచార గడువు ఉంది. అప్పటివరకు లోక్సభ నియోజకవర్గం మొత్తం అలుపెరగకుండా తిరగాలంటే కనీసం రూ.50 కోట్లుకు పైగా అవసరమవుతుందని నేతలు అంచనా వేస్తున్నారు. వేసవికాలం కావడంతో ఏసీ వాహనాలు, మజ్జిగ, భోజనాలు, మంచినీరు, బిర్యానీలు, ప్రచార పత్రాలు, మద్యం, ఫ్లెక్సీలు ఇలా అన్నింటికీ భారీగా డబ్బు అవసరం అవుతుంది. ఏదైనా చిన్న గ్రామంలో ప్రచారానికి వెళ్లాలి అన్నా ఖర్చులు(Lok Sabha Election Expenditure) ఇవ్వాలని కార్యకర్తలు, అక్కడి ఛోటామోటా నేతలు అడుతున్నారని అభ్యర్థులు తెలుపుతున్నారు.
ఈ క్రమంలో ఒక్కో కార్యకర్త రోజుకు రూ.1000 దాకా అడుగుతున్నారని చెబుతున్నారు. ఇందుకు భోజనం, మద్యం అదనం. అలాగే మండలస్థాయి నేతలకు రూ.లక్షల్లో చెల్లిస్తేనే ప్రచారానికి ముందుకు వస్తున్నారని వాపోతున్నారు. ఇవి కాకుండా ఆయా సామాజిక వర్గ సంఘాలు, కాలనీ సమూహాల విజ్ఞప్తుల మేరు సామూహిక అవసరాల కోసం అక్కడక్కడా భారీ మొత్తం సొమ్ము వెచ్చించాల్సి ఉంటుంది. స్థానికులకు అవసరమైన కొన్ని పనులు కూడా చేసి పెట్టాల్సి వస్తుందన్నారు.