NDA Leaders on Union Budget 2024 :కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి పెద్దపీట వేశారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి లంకా దినకర్ హర్షం వ్యక్తం చేశారు. వికసిత ఆంధ్రప్రదేశ్ దిశగా కేంద్రం బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిందని అభిప్రాయపడ్డారు. 9 కీలక అంశాలను మేళవించి బడ్జెట్ తయారు చేశారని, రాజధాని అమరావతి, పోలవరం అభివృద్ధికి బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చారని దినకర్ చెప్పారు. అమరావతికి 15 వేల కోట్లు బడ్జెట్లో కేటాయించారని, రాజధానికి ఊతం ఇచ్చే విధంగా బడ్జెట్ ఉందని చెప్పారు. పోలవరం పూర్తి చేసేందుకు బడ్జెట్లో హామీని అందించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
రాజధానికి రూ. 15 వేల కోట్లు అప్పా? లేక గ్రాంటా? - నిర్మలా సీతారామన్ స్పష్టత - Budget 2024 for AP
వెనుకబడిన ప్రకాశం, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలను ఆదుకుంటామని బడ్జెట్లో హామీ ఇచ్చారని, కొప్పర్తి, ఓర్వకల్లులో ఇండస్ట్రియల్ హబ్‌ల ఏర్పాటు ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు కానున్నాయని దినకర్ చెప్పారు. రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్‌పై ప్రధాని మోదీ ఇచ్చిన హామీలు నిజమయ్యాయని చెప్పారు. బడ్జెట్ రూపకల్పనలో వాస్తవికతకు పెద్దపీట వేశారని, వృద్ధిరేటు 6.8 శాతం ఉంటుందని అంచనా వేశారని అన్నారు. యువత కోసం 2 లక్షల కోట్లతో 5రకాల పథకాలు రూపొందించారని, విద్యార్దులకు రూ.10 లక్షల వరకు విద్యారుణం కల్పించారని చెప్పారు. మహిళా సాధికారిత దిశగా వివిధ పథకాల కింద మహిళలకు 3 లక్షలు కేటాయింపు జరిగిందన్నారు. వ్యవసాయ రంగానికి, గ్రామీణ పరిశ్రమల అభివృద్ధికి ఆసరా ఇచ్చారని, గ్రామీణ ఉపాధి హామీ కింద 86 వేల కోట్ల రూపాయలను బడ్జెట్లో కేటాయించారని ఆయన తెలిపారు.