Minister Anitha Warning to YSRCP Social Media Activists :సామాజిక మాధ్యమాల్లో అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై చర్యల కోసం ఓ చట్టం తేవాలని భావిస్తున్నామని హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టేవారు ఉగ్రవాదుల కన్నా ప్రమాదకరమని మండిపడ్డారు. సామాజిక మాధ్యమాల్లో మహిళలపై పోస్టులు పెడితే వాళ్ల భరతం పడతామని హెచ్చరించారు. జగన్ ఐదేళ్ల పాలనలో రాజకీయ ముసుగులో సామాజిక మాధ్యమాల ద్వారా మహిళల పై దారుణమైన పోస్టులు పెట్టారు. జగన్ తన సొంత తల్లి, చెల్లిపై పోస్టులు పెట్టిన రవీంద్రరెడ్డిని వెనకేసుకువచ్చారని ధ్వజమెత్తారు.
దుర్మార్గుల్ని వదిలేయాలా? :వైఎస్సార్సీపీ పాలనలో రౌడీలకు రాజకీయ ముసుగు వేసింది జగనే అన్నారని ఆరోపించారు. జగన్ పాలనలో ప్రతీ 8 గంటలకు మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగాయని ఆరోపించారు. చంద్రబాబు సతీమణి, పవన్ కల్యాణ్ కుమార్తెలపైనా, హోం మంత్రినైన తనపై కూడా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై పెట్టిన అసభ్యకరమైన పోస్టులపై తాను గుండే ధైర్యంతో భరిస్తున్నా ఇతరులైతే ఆత్మహత్య చేసుకునేవారన్నారు. అలాంటి దుర్మార్గుల్ని చూస్తూ వదిలేయాలా ప్రశ్నించారు. జగన్ తన చెల్లి షర్మిలపై పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తి షకీలా అనే పోస్టు పెట్టినా చూస్తూ ఊరుకున్నారని దుయ్యబట్టారు.
సీఎం ఆఫీస్‌లో మంత్రులు పవన్, అనిత భేటీ - ఇద్దరూ ఏం చర్చించారంటే!
వైఎస్సార్సీపీ బ్యాచ్ పైశాచిక ఆనందం :ఐదేళ్ల పాలనను, ప్రజాస్వామ్యాన్ని జగన్ వెంటిలేటర్‌పై పెట్టారని ఎద్దేవా చేశారు. జగన్ పోలీసుల్ని తన ఇంటి కాపలా కోసం వేధింపుల కోసం వాడుకున్నారని ఆరోపించారు. పోలీసు వ్యవస్థను సర్వనాశనం చేసిన వ్యక్తి ఇప్పుడు ఆ వ్యవస్థపై ఆరోపణలు చేయటం విడ్డూరంగా ఉందన్నారు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టిన ఎంత మందిని అరెస్టు చేశారో జగన్‌కు గుర్తుందా అని నిలదీశారు. సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టిన వైఎస్సార్సీపీ బ్యాచ్ పైశాచిక ఆనందం పొందుతోందని తెలిపారు. మహిళలపై అసభ్యకరమైన పోస్టులు పెడుతుంటే ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చోవాలా అని నిలదీశారు.