తెలంగాణ

telangana

'2026 మార్చి కల్లా దేవాదుల ప్రాజెక్టు పూర్తి - ఆర్థిక ఇబ్బందులున్నా ప్రాజెక్టులు పూర్తి' - uttam om Devadula irrigation Works

By ETV Bharat Telangana Team

Published : Aug 30, 2024, 4:23 PM IST

Updated : Aug 30, 2024, 4:49 PM IST

Devadula Lift Irrigation Project Works : దేవాదుల ప్రాజెక్టుపై మంత్రుల సమీక్ష ముగిసింది. ప్రాజెక్టు ఇంటెక్​ వెల్​, పంప్​ హౌస్​ను మంత్రులు పరిశీలించారు. దాదాపు మూడు గంటలపాటు అధికారులతో సమక్ష నిర్వహించారు. 2026 మార్చికల్లా దేవాదుల ప్రాజెక్టు పూర్తిచేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్​ఎస్​ పాలనలో ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగాయని, ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు.

Devadula Lift Irrigation Project Works
Devadula Lift Irrigation Project Works (ETV Bharat)

Minister Uttam Kumar Reddy Review on Devadula project : 2026 మార్చికల్లా దేవాల ప్రాజెక్టును పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​కుమార్​ రెడ్డి స్పష్టం చేశారు. సోనియా గాంధీ చేతుల మీదగా ప్రారంభోత్సవం చేస్తామని అన్నారు. ఇరిగేషన్​ శాఖను అడ్డుపెట్టుకొని మాజీ సీఎం కేసీఆర్​ దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు. ప్రతి ప్రాజెక్టులో వేల కోట్ల స్కాం జరిగిందని ఆరోపించారు. ములుగు జిల్లా దేవాదుల ప్రాజెక్టును మంత్రులు ఉత్తమ్​, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క పరిశీలించారు. ఈ సమావేశం దాదాపు మూడు గంటల పాటు సాగింది. ఈ సమావేశం ముగిసిన అనంతరం మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించారు.

కేసీఆర్​ హయాంలో ప్రాజెక్టులపై కోట్ల ఖర్చు పెట్టారని మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి తెలిపారు. రూ.14 వేల కోట్ల బిల్లులు పెండింగ్​లో ఉంచారని పేర్కొన్నారు. కమిషన్ల కక్కుర్తి కొరకు ప్రాజెక్టులు కట్టారని విమర్శించారు. కాళేశ్వరం, పాలమూరు, దేవాదుల, సీతారామ అన్నిట్లో గత ప్రభుత్వం దోపిడి కనిపిస్తోందన్నారు. తెలంగాణ గ్రామీణ ముఖ చిత్రం మార్చడం కాంగ్రెస్​ ప్రభుత్వం లక్ష్యమని వివరించారు. ప్రతి ఎకరాకు నీళ్లు అందిస్తామని మాటిచ్చారు.

కాళేశ్వరం ప్రాజెక్టును గత ప్రభుత్వం నాశనం చేసిందని మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నిర్దేశిత గడుపులోపు దేవాదుల పూర్తి చేసి, 5.57 లక్షల ఎకరాలకు నీళ్లు అందిస్తామని తెలిపారు. సమ్మక్క బ్యారేజీ కట్టడం వల్ల దేవాదుల ద్వారా 300 రోజులు 60 టీఎంసీల నీళ్లు లిఫ్ట్​ చేస్తామని వివరించారు. ఉమ్మడి వరంగల్​ జిల్లాను సస్యశ్యామలం చేస్తామని అన్నారు. ఇరిగేషన్​ ప్రాజెక్టులపై కేసీఆర్​కు అవగాహన లేకుండా తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. వాటిని ప్రస్తుత ప్రభుత్వం సరి చేసుకుంటూ వస్తోందన్నారు.

సీతారామ ప్రాజెక్టుకు 67 టీఎంసీలు కేటాయించేలా సీడబ్ల్యూసీతో చర్చలు జరుపుతున్నామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి స్పష్టం చేశారు. సమ్మక్క సారక్క బ్యారేజీ ఎన్​ఓసీ కోసం ఛత్తీస్​గఢ్​ను ఒప్పిస్తామని చెప్పారు. ఉత్తుత్తి హామీలు కాంగ్రెస్​ ప్రభుత్వం ఇవ్వదని, చెప్పింది చేసి తీరుతామని మాటిచ్చారు. ఫాంహౌస్​లో కూర్చొని నిర్ణయాలు తీసుకోమని, 24 గంటలు ప్రజలకు, అధికారులకు అందుబాటులో ఉంటామని వెల్లడించారు.

"2026 నాటి కల్లా దేవాదులు ప్రాజెక్టును పూర్తి చేసి ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు 5లక్షల 57వేల ఎకరాలకి నీరందిస్తాం. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రాజెక్టు అభివృద్ధి మరుగున పడింది. ఒక్కో అడుగు ముందుకేస్తూ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతుల కళ్లలో సంతోషం నింపడమే తమ ప్రభుత్వం లక్ష్యం. దేవాదుల ద్వారా 300 రోజులు గోదావరి నీటిని 60టీఎంసీలు ఎత్తిపోశాం. ప్రతి ఎకరాకు నీరు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం."- ఉత్తమ్​ కుమార్​ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి

దేవాదుల ప్రాజెక్టు పెండింగ్​ బిల్లులు త్వరలోనే చెల్లిస్తాం : దేవాదుల ప్రాజెక్టు పెండింగ్​ బిల్లులు త్వరలో చెల్లిస్తామని మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి చెప్పారు. ధరలు పెరడంతో భూసేకరణ ఇబ్బందిగా మారిందని అన్నారు. పారదర్శకంగా భూసేకరణ చేస్తామని, ఇరిగేషన్​ ప్రాజెక్టుల కోసం ప్రత్యేక ఐఏఎస్​ అధికారిణి నియమిస్తామన్నారు. ఇరిగేషన్​ శాఖ బలోపేతం కోసం 700 మంది అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్​ ఇంజినీర్లను నియమించామని మరో 1800 లస్కర్లను తీసుకోబోతున్నామని తెలిపారు. అన్ని ప్రాజెక్టులకు డిసిల్టింగ్​, డీసెడిమెంట్​ అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించి చేయబోతున్నామని మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి స్పష్టంగా చెప్పారు.

వచ్చే ఏడాది ఆఖరుకు దేవాదుల పూర్తి! - నేడు ప్రాజెక్టుపై మంత్రి ఉత్తమ్‌ సమీక్ష - Minister Uttam Review On Devadula

Devadula Lift Irrigation: అడుగడుగునా జాప్యం.. 17 ఏళ్లయినా పూర్తికాని దేవాదుల ఎత్తిపోతల

Last Updated : Aug 30, 2024, 4:49 PM IST

ABOUT THE AUTHOR

...view details