Minister Uttam Kumar Reddy on Medigadda Project Issue : మేడిగడ్డ విషయంలో బీఆర్ఎస్ తీరు హాస్యాస్పదంగా ఉందని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ధ్వంసమైన బ్యారేజీని చూసిన బీఆర్ఎస్ నేతలు ఇప్పటికై ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. మేడిగడ్డ వెళ్తున్న బీఆర్ఎస్ నేతల బస్సు టైర్ పేలిపోయిందని కారు సహా ఆ పార్టీ వాహనాలన్నీ ఇక షెడ్డుకేనని పరిమితమని మంత్రి ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో నిర్వహించిన చిట్‌చాట్‌లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uttam Kumar Chitchat) ఈ విధంగా స్పందించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్, నిర్మాణంలో బీఆర్ఎస్ భారీ తప్పిదాలు చేసిందని కమీషన్లకు కక్కుర్తిపడి రైతుల ప్రయోజనాలను పణంగా పెట్టిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి బీఆర్ఎస్ పాపాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికీ భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. సరైన అనుమతులు లేకుండానే కేంద్ర ప్రభుత్వ సంస్థలు వేల కోట్ల రూపాయల రుణాలు ఎలా ఇచ్చాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. వాస్తవానికి రుణాలను కేసీఆర్, కేటీఆర్ కూడబెట్టుకున్న సంపాదన నుంచే కట్టాలి కానీ ప్రభుత్వంపై ఆ భారం పడిందన్నారు. నాగార్జున సాగర్ నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టేందుకు వీలుగా సీఆర్పీఎఫ్ బలగాలను తొలగించాలని కోరామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు ఎన్డీఎస్ఏ(NDSA) కమిటీ వేయడాన్ని స్వాగతిస్తున్నామని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను యుద్ధప్రాతిపదినక పరిశీలించి నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలని ఎన్డీఎస్ఏను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు. నెల రోజుల్లో ప్రాథమిక నివేదిక ఇవ్వనున్నట్లు జాతీయ డ్యాం సేఫ్టీ అథారిటీ తెలిపిందన్నారు. శనివారం దిల్లీ వెళ్లి కేంద్ర అధికారులను కలిసి దీనిపై చర్చించనున్నట్లు మంత్రి తెలిపారు.