Minister Ponnam Comments : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు బదిలీల కోసం తన వద్దకు రావొద్దని సూచించారు. ఈ రెండు విషయాలలో తనపై ఒత్తిడి తేవద్దని కోరారు. ఉపాధ్యాయుల బదిలీల కోసం కొన్ని వందల వేల మంది వస్తున్నారన్నారు. ఆర్టీసీకి సంబంధించిన మంత్రిని అయినా కూడా బదిలీల విషయంలో తానేమి చేయలేనన్నారు. ఈ రెండు పనులు తప్ప హుస్నాబాద్ శాసనసభ్యుడిగా నియోజకవర్గంలో మిగతా అభివృద్ధి పనులు చేస్తానని స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు సంబంధించి భారతీయ జనతా పార్టీ స్టాండ్ ఏంటో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఇచ్చిన హామీకి అనుగుణంగా కులగణను ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నామని తెలిపారు. హనుమకొండ జిల్లాలోని భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్‌లో మంత్రి కుల గణన సర్వేను పరిశీలించారు. సర్వే ఎలా కొనసాగుతుందని అక్కడి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
దేశవ్యాప్తంగా కులగణన చేయాలి : బుద్ధి, జ్ఞానం లేనోళ్లు రాహుల్ గాంధీ కులం ఏంటని మాట్లాడుతున్నారని, ఆయన కులం కావాలంటే దేశవ్యాప్తంగా కులగణన సర్వే చేస్తే తెలిస్తుందన్నారు. కులగణనకు బీజేపీ దేశవ్యాప్తంగా వ్యతిరేకంగా ఉందని చెప్పారు. ఎవరైనా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కులం అడుగుతున్నారా? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ కులం గురించి మాట్లాడుతున్నారంటే వారికి భయం ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు.