TDP Leader Srinu Murder in Kurnool :కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేత దారుణ హత్యకు గురయ్యారు. పత్తికొండ మండలం హోసూరులో ఈ ఘటన చోటు చేసుకుంది. టీడీపీ నేత, మాజీ సర్పంచ్ వాకిటిశ్రీనివాసులు (45) బుధవారం తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లగా దుండగులు ఆయన కళ్లలో కారం చల్లి దారుణంగా హతమార్చారు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు, గ్రామస్థులు ఘటనాస్థలికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, సీఐ జయన్న ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించి విచారణ చేపట్టారు. తాజా ఎన్నికల్లో కీలకంగా వ్యవహరించిన శ్రీనును వైఎస్సార్సీపీ నేతలే హత్య చేయించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
జగన్ అండ్ కో తమ పాత పంథా మార్చుకోలేదు :వాకిటి శ్రీనివాసులును వైఎస్సార్సీపీ మూకలు దారుణంగా హత్య చేశారని మంత్రి నారా లోకేశ్ ఆరోపించారు. హత్యను తీవ్రంగా ఖండించారు. ఎన్నికల్లో తెలుగుదేశం తరఫున కీలకంగా పని చేశాడనే కక్షతో శ్రీనివాసులు కళ్లల్లోకి కారం కొట్టి కిరాతకంగా హతమార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాక్షేత్రంలో తిరస్కారానికి గురైనప్పటికీ జగన్ అండ్ కో తమ పాత పంథా మార్చుకోకుండా ఇటువంటి దురాగతాలకు పాల్పడుతున్నారని ఆక్షేపించారు. తెలుగుదేశం శ్రేణుల సహనాన్ని చేతగానితనంగా భావిస్తూ, ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడే వారిపై ప్రజా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ మూకల చేతిలో బలైన శ్రీనివాసులు కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
కర్నూలు జిల్లాలో టీడీపీ నేత దారుణ హత్య - వైఎస్సార్సీపీ నేతల పనేనని ఆరోపణలు - TDP Leader Srinu Murder
పార్టీ అండగా ఉంటుంది : కర్నూలు జిల్లాలో శ్రీను హత్యను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఖండించారు. హత్య వెనుక ఎవరున్నా వదిలిపెట్టే సమస్య లేదని స్పష్టం చేశారు. హోసురులో టీడీపీకి భారీ మెజారిటీ రావడంలో శ్రీనుది కీలక పాత్ర అని తెలిపారు. వాకిటి శ్రీను కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.