Minister Konda Surekha slams KTR :మాజీమంత్రి కేటీఆర్‌పై, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ మరోసారి విమర్శల దాడి చేశారు. సోషల్ మీడియాలో తమపై పిచ్చిరాతలు రాయిస్తున్నారని, బీఆర్ఎస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆరేనని ఆమె దుయ్యబట్టారు. గతంలో కేటీఆర్ తనను తాను సీఎంలా భావించి చెత్త నిర్ణయాలు తీసుకున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ ఇప్పటికైనా ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.
పదవీకాంక్షతో కేసీఆర్‌ని కేటీఆర్ ఏదో చేశాడన్న ప్రచారం ఉందని మంత్రి సురేఖ ఆరోపించారు. బడ్జెట్ రోజు వచ్చిన కేసీఆర్ మళ్లీ కనపడలేదని, ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ ఏం చేస్తున్నారో తెలియదని ఆమె తెలిపారు. కేసీఆర్ కనపడటం లేదని గజ్వేల్‌లో పోలీస్ స్టేషన్-2 లో ఫిర్యాదు చేస్తామన్నారు. బీఆర్‌ఎస్, బీజేపీ మధ్య చీకటి ఒప్పందం జరిగిందని, కవిత బెయిల్ కోసం బీజేపీతో కలిశారని ఆరోపించారు. సిసోడియాకి ఇవ్వని బెయిలు ముందుగా కవితకు వచ్చిందంటే అది చీకటి ఒప్పందం కాదా అని కొండా సురేఖ ప్రశ్నించారు.
నాగార్జున పరువు నష్టం దావా : మరోవైపు నిన్న అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సినీనటుడు అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు. తమ కుటుంబ సభ్యుల గౌరవాన్ని, ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఆమె వ్యాఖ్యలు చేశారంటూ ఆయన నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై చిత్ర పరిశ్రమలోని నటీనటులు సైతం స్పందించారు. సినీనటుల వ్యక్తిగత జీవితాలను తీసుకురావడం దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ఠ అని వారు మండిపడ్డారు. ఆధారాల్లేని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే మౌనంగా చూస్తూ కూర్చోబోమని హెచ్చరించారు.