Minister Konda Surekha Explanation Comments on KTR :తనపై రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే అలా విమర్శించాల్సి వచ్చిందని మంత్రి కొండా సురేఖ వివరణ ఇచ్చారు. తనకు ఎవరిపై వ్యక్తిగత ద్వేషం, కోపం లేదని అన్నారు. తన నుంచి అనుకోకుండా ఒక కుటుంబం (అక్కినేని కుటుంబం) పేరు వచ్చిందన్నారు. ఆ కుటుంబం ట్వీట్ చూశాక తాను చాలా బాధపడ్డానని తెలిపారు. తాను బాధపడుతున్నట్లు ఇంకొకరు బాధపడొద్దనే వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నానని స్పష్టం చేశారు. హనుమకొండలోని ఆమె నివాసంలో మంత్రి మీడియాకు వివరాలు వెల్లడించారు.
ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ, 'నేను పడిన బాధ, అవమానం ఇంకొకరిపై పడకూడదనే నేను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాను. కేటీఆర్ విషయంలో తగ్గేది లేదు, ఆయన నాకు క్షమాపణ చెప్పాల్సిందే. కేటీఆర్ చేసిందంతా చేసి, దొంగే దొంగ అని అరిచినట్లు ఉంది. కేటీఆర్ లీగల్ నోటీసుపై న్యాయపరంగా ముందుకెళ్తాం.' అని ఆమె స్పష్టం చేశారు.
"కేటీఆర్ క్యారెక్టర్ గురించి, గతంలో వారు చేసిన కార్యక్రమాలు, మహిళల మీద ఆయనకు ఉన్న చులకన భావన గురించి మాట్లాడాను. కేటీఆర్ నన్ను రెచ్చగొట్టే విధంగా మాట్లాడినప్పుడు నేను భావోద్వేగానికి లోనై ఆయన మీద విమర్శలు చేయాల్సిన అవసరం వచ్చింది. ఆ సందర్భంలో వేరొకరి మీద వ్యక్తిగత ద్వేషం కానీ, కోపం కానీ లేదు. ఒక కుటుంబం మాట తీయడమనేది నా నోటి నుంచి అనుకోకుండా వచ్చింది. ఆ తర్వాత వారి ట్వీట్స్ చూసి నేను చాలా బాధపడ్డాను. నేను ఏ విషయంలో అయితే బాధపడుతూ ఉన్నానో అదే విషయంలో వేరే కుటుంబాన్ని నొప్పించానని తెలిసి రాత్రి వెంటనే ఆ మాటలను వెనక్కి తీసుకుంటూ ట్వీట్ చేశాను. నేను పడిన బాధ వేరే ఇంకొకరు పడకూడదు. అందుకే బేషరతుగా వెనక్కి తీసుకున్నాను. కానీ కేటీఆర్ విషయంలో మాత్రం తగ్గేదే లేదు. ఆయన క్షమాపణ చెప్పాల్సిందే." - కొండా సురేఖ, మంత్రి