Minister Gummadi Sandhya Rani Fires on YS Jagan :పెద్దవాళ్లంటే వైఎస్సార్సీపీ అధ్యక్షుడు జగన్‌కు ఏమాత్రం గౌరవం లేదని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జగన్ తీరు మారకుంటే ప్రజలు ఈసారి కూడా క్షమించరన్నారు. జగన్ మానసిక పరిస్థితి సరిగా లేదని, కావాలంటే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి డబ్బులు ఇప్పిస్తానని సంధ్యారాణి ఎద్దేవా చేశారు. ఐదేళ్లు బూతులు మాట్లాడిన జగన్ నోట నీతులు ప్రజలు వినలేకపోతున్నారన్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కేంద్ర, రాష్ట్ర నిధులన్నీ దారి మళ్లించి వాడేసుకున్న తిమింగళాలని విమర్శించారు.
ఆత్మలతో మాట్లాడే జగన్ మానసిక పరిస్థితి అందరికీ తెలిసిందేనన్నారు. లండన్‌లో తెచ్చుకున్న మందులు పని చేయట్లేదని జగన్ మానసిక పరిస్థితి చూస్తే అర్ధమవుతోందని సంధ్యారాణి మండిపడ్డారు. జగన్‌కు విశ్వసనీయత అనే పదం తెలుగులో రాయటం రాదు, ఇంగ్లీషులో అర్ధం తెలీదని గుమ్మిడి సంధ్యారాణి ఎద్దేవా చేశారు.
‘జగన్ ఏం మాట్లాడుతున్నారో ఆయనకైనా అర్థమవుతోందా? ఆయనకు మతి భ్రమించినట్లుగా ఉంది. రూ.20 వేల కోట్లు అప్పు చేసిన పెద్ద మనిషి ఆ డబ్బులతో ఏం చేశారో చెప్పాలి. ఏప్రిల్, మేలో రూ.20 వేల కోట్లు అప్పు చేశారు. వెంటనే ఎన్నికలు వచ్చాయి. ఆ డబ్బుతో ఏం చేశారో చెప్పాలి. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ కంచె వేసుకునేందుకు ఖర్చు పెట్టారా? వైఎస్సార్సీపీ నేతలు నిధులన్నీ దారి మళ్లించి వాడేసుకున్న తిమింగలాలు. ఆఖరికి సర్పంచుల నిధులు కూడా దారి మళ్లించిన ఘనత జగన్‌ది’ -గుమ్మిడి సంధ్యారాణి, మంత్రి