Legislative Council Approves Repeal Land Titling Act 2022 :వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, సహా హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరును పునరుద్ధరించే బిల్లులను శాసనమండలి ఆమోదించింది. శాసన సభలో ఆమోదం అనంతరం బిల్లును మంత్రి సత్యకుమార్ యాదవ్ శాసన మండలిలో ప్రవేశపెట్టారు. పలువురు అధికార పార్టీ ఎమ్మెల్సీలు ల్యాండ్ టైట్లింగ్ బిల్లులోని లోపాలను ఎత్తిచూపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరిట వైఎస్సార్సీపీ సర్కార్ చేసిన చట్టం రాక్షస చట్టంగా ఎమ్మెల్సీలు పంచుమర్తి అనురాధ అభివర్ణించారు.
భూ దోపిడీల కోసమే ఈ చట్టాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెచ్చిందని ఎమ్మెల్సీ అశోక్ బాబు ధ్వజమెత్తారు. అనేక లోపాలున్నాయని గతంలోనూ చట్టాన్ని వ్యతిరేకించినా గత వైఎస్సార్సీపీ సర్కారు రాత్రికి రాత్రి నిర్ణయాలు తీసుకుని చట్టాలు చేసిందని, పీడీఎఫ్ ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రజలను భయాందోళనలకు గురి చేయడం సహా ఆస్తులకు రక్షణ కల్పించలేని ఈ తరహా చట్టాలను బిల్లులను రద్దు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. మహనీయుడు ఎన్టీఆర్ పేరును హెల్త్ యూనివర్సిటీకి పెట్టగా జగన్ ప్రభుత్వం తొలగించడాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ తీవ్రంగా తప్పుపట్టారు. తిరిగి ఆయన పేరుపెట్టి మహనీయుడిని స్మరించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అనంతరం మూజువాణి ఓటుతో రెండు బిల్లులను మండలి చైర్మన్ మోషేను రాజు ఆమోదించారు.