ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / politics

పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో భారీ కుంభకోణం - వైఎస్సార్సీపీ నేతల ఇన్‌సైడర్‌ ట్రేడింగ్​ - Jagananna Colonies Land Scam

YSRCP Leaders Land Scam in AP : పేదలకు ఇళ్లస్థలాల సేకరణ పేరిట వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో భారీ కుంభకోణం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా భూసేకరణ కంటే ముందే కొన్నిచోట్ల రైతులతో తక్కువ మొత్తానికి అగ్రిమెంట్‌ చేసుకుంది. ఆ తర్వాత ధరను అమాంతం పెంచి ప్రభుత్వం కొనుగోలు చేసేలా ఎత్తుగడ వేసింది. మరోవైపు అన్నదాతల నుంచి కమీషన్‌ రూపంలోనూ భారీగా వసూళ్లు చేసింది. తద్వారా 18 లేఔట్లలోనే రూ.482 కోట్ల మేర కుంభకోణం జరిగింది.

Jagananna Colonies Land Scam
Jagananna Colonies Land Scam (Etv Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 1, 2024, 1:32 PM IST

Jagananna Colonies Land Scam : పేదలకు ఇళ్లస్థలాల సేకరణలో జగన్​ సర్కార్​ భారీ కుంభకోణానికి పాల్పడింది. ఆ పార్టీ నాయకులు వందల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టారు. దీనికి అధికారులూ వంతపాడారు. ప్రభుత్వం ఇళ్ల స్థలాల కోసం భూ సేకరణ చేస్తుందని తెలుసుకున్న వైఎస్సార్సీపీ నేతలు కొన్నిచోట్ల అన్నదాతల నుంచి ముందే తక్కువ ధరకు అగ్రిమెంట్ చేసుకున్నారు. మరికొందరు రిజిస్ట్రేషన్‌ కూడా పూర్తి చేశారు.

Jagananna Layouts Scam in AP :ఆ తర్వాత సర్కార్ భూసేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేయగానే భూముల విలువను మార్కెట్‌ ధర కంటే 25 నుంచి 30 శాతం వరకు పెంచి చూపించారు. ఆ మేరకు ప్రభుత్వం డబ్బులు విడుదల చేసేసింది. ఇదంతా ఎంత వేగంగా జరిగిందంటే కొన్ని చోట్ల భూమిని సేకరించిన వారం, పది రోజుల్లోనే నిధులు వారి ఖాతాల్లోకి జమ అయ్యాయి. రైతులకు పప్పుబెల్లాలిచ్చి, వైఎస్సార్సీపీ నాయకులు భారీగా దోచుకున్నారు. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఎక్కువగా ఈ తరహా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగింది. మరికొన్ని చోట్ల అన్నదాతల నుంచి కమీషన్‌ రూపంలో దోచుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 18 లేఔట్లలోని భూసేకరణ అవకతవకలను లెక్కిస్తేనే దాదాపు రూ.482 కోట్ల కుంభకోణం తేలింది. దీనిపై నూతన ప్రభుత్వం విచారణ చేయిస్తే మరిన్ని వాస్తవాలు వెలుగుచూసే అవకాశముంది.

ప్రైవేట్ భూముల సేకరణకు రూ.11,000ల కోట్లు :రాష్ట్రవ్యాప్తంగా జగనన్న కాలనీల కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.11,334 కోట్లు పెట్టి ప్రైవేట్ భూముల్ని కొనుగోలు చేసింది. కాలనీల ఏర్పాటుపై సమాచారమున్న కొందరు నాయకులు వారి భూములకు సమీపంలో అవి వచ్చేలా చేసుకుని విలువ పెరిగేలా మంత్రాంగం నడిపారు. మరికొందరు పేదల నుంచి తక్కువ ధరకు భూముల్ని కొనుగోలు చేసి సర్కార్​కి ఎక్కువకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఎన్నికల నాటికే రూ.11,164 కోట్లు జగన్​ ప్రభుత్వం చెల్లించింది.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో రూ.100 కోట్లకు పైగా :ఉమ్మడి కృష్ణా జిల్లాలో భూ సేకరణ పేరుతో రూ.100 కోట్లకు పైగానే వైఎస్సార్సీపీ నాయకుల జేబుల్లోకి వెళ్లింది. గన్నవరం నియోజకవర్గంలో 400 ఎకరాలు కొన్నారు. ఇక్కడ ఎకరం రూ.35 లక్షల వరకు ఉంటే రూ.50-60 లక్షల చొప్పున కొన్నారు. కిందిస్థాయి అధికారి నుంచి అప్పటి కీలక ప్రజాప్రతినిధి వరకూ అందరూ భారీగా వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. మచిలీపట్నం పరిధిలో ఎకరా రూ.15 లక్షలుంటే రూ.32 లక్షలకు కొన్నారు. ఇక్కడ 380 ఎకరాల కొనుగోలులో ఆ పార్టీ ప్రజాప్రతినిధి తనయుడు చేతివాటం ప్రదర్శించారనే ఆరోపణలున్నాయి.

  • గుడివాడ శివారులో 77 ఎకరాలను సేకరించారు. ఎకరా మార్కెట్‌ ధర రూ.25 లక్షలు ఉంటే, రూ.55లక్షలు చెల్లించారు. అన్నదాతల ఖాతాలో సొమ్ములు పడగానే ఎకరాకు రూ.5-10 లక్షల కమీషన్లు వసూలుచేశారు. ఇక్కడి కీలక వైఎస్సార్సీపీ నేత, ఆయన ముఖ్య అనుచరులు భారీగా వసూళ్లకు పాల్పడ్డారు.
  • నందిగామలోని అనాసాగరంలో 35 ఎకరాల్లో లేఅవుట్‌ వేశారు. ఇక్కడ ఎకరానికి రూ.5 లక్షల చొప్పున అక్కడి వైఎస్సార్సీపీ నేత కమీషన్‌ తీసుకున్నారు.

ఒక్కో రైతు నుంచి రూ.20 లక్షల డిమాండ్‌ : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జగనన్న కాలనీల ఏర్పాటుకు వైఎస్సార్సీపీ నేతల ఒత్తిడితో అధికారులు 8 ఎకరాల ఎసైన్డ్‌ భూమిని ఎంపికచేశారు. ఎకరం రూ.44.53 లక్షల చొప్పున రూ.3.56 కోట్లు చెల్లించారు. ఇందుకు రైతుల నుంచి ఆ పార్టీ నాయకులు రూ.20 లక్షలు డిమాండ్‌ చేయగా రూ.10 లక్షలు ఇచ్చామని అప్పట్లో అన్నదాతలు ఫిర్యాదుచేశారు.

YSRCP Leaders Land Scam in AP :తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మేర్లపాక, పాగలి, చిందేపల్లి ప్రాంతాల్లో జగనన్న కాలనీల కోసం 385 ఎకరాలు సేకరించారు. ఇక్కడ శ్రీకాళహస్తికి చెందిన అప్పటి వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధి ముఖ్య అనుచరుడు చేతివాటం ప్రదర్శించారు. అన్నదాతల నుంచి ఎకరాకు రూ.లక్షపైనే అంటే రూ.3.85 కోట్లు రైతుల నుంచి వసూలు చేశారు. చంద్రగిరి మండలం తొండవాడ పంచాయతీ పరిధిలో 169 ఎకరాలు సేకరించారు. వీటిని ఏ, బీ, సీ, డీగా విభజించి దానికి అనుగుణంగా పరిహారం చెల్లించారు. ఆ విభాగాలను మార్చేందుకు ఆ పార్టీ స్థానిక నేతలు కర్షకుల నుంచి సొమ్ము వసూలుచేశారు.

రూ.30 లక్షల భూమి రూ.80 లక్షలకు కొనుగోలు :బాపట్ల నియోజకవర్గం కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెంలో వైఎస్సార్సీపీ నాయకులు 1.17 ఎకరాలను గజాల లెక్కన ధర నిర్ణయించారు. ఇక్కడ ఎకరా రూ.30 లక్షలు ఉంటే రూ.88 లక్షలకు కొనిపించారు. తూర్పు బాపట్లలో 52 ఎకరాలకు పైగా అసైన్డ్‌ భూముల్ని జగనన్న కాలనీకి అధికారులు సేకరించారు. దీనికి సాగుదారులకు రూ.36 కోట్లు చెల్లించారు. ఇందులో రూ.6 కోట్లను అధికారపార్టీ ప్రజాప్రతినిధి స్వాహాచేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

  • నెల్లూరు జిల్లా కావలిలో జగనన్న కాలనీ కోసం ముసునూరు వద్ద 112 ఎకరాలను సేకరించారు. అక్కడ మార్కెట్‌ ధర ఎకరాకు రూ.12 లక్షలు ఉండగా రూ.55 లక్షలకు కొన్నారు. ఇందులో 13 ఎకరాలు వైఎస్సార్సీపీ నేతకు చెందిన 12 మంది అనుయాయుల పేరుతో కొనుగోలు చేసి ఒకే రోజు రిజిస్ట్రేషన్‌ చేయించారు. ఇందులో రూ.30 కోట్లను ఆ పార్టీ నాయకులు దండుకున్నారు.
  • కర్నూలు జిల్లా ఆదోని సమీపంలోని మండగిరిలో 190 ఎకరాల్లో జగనన్న లేఔట్‌ వేశారు. అక్కడి ప్రజాప్రతినిధి తన బినామీలతో మండగిరిలో భూములను కొనిపించారు. రైతుల నుంచి ఎకరం రూ.5 లక్షలకు సేకరించి రూ.13.50 లక్షల చొప్పున సర్కార్​ నుంచి కొనిపించారు. ఇందులో రూ.15 కోట్ల మేర అవినీతి జరిగింది.

తెనాలిలో రూ.81 కోట్ల దోపిడీ : గుంటూరు జిల్లా తెనాలి నియోజకవర్గంలో 500 ఎకరాలకు పైగా సేకరించారు. ఈ విషయాన్ని ముందుగా తెలుసుకున్న అప్పటి నియోజకవర్గ కీలక వైఎస్సార్సీపీ నాయకుడు అన్నదాతల నుంచి తక్కువ ధరకు అనుచరులతో భూములు కొనిపించారు. ఎకరా రూ.25-30 లక్షల వరకు రైతులకు చెల్లించి 60 ఎకరాలు కొన్నారు. పట్టణానికి దూరంగా ఉన్నా, ఆ నేతకు లబ్ధి కోసమే ఆ భూమిని సర్కార్​తో ఎకరా రూ.90 లక్షలకు కొనిపించారు. దీంతో 60 ఎకరాలకు రూ.36 కోట్ల లబ్ధిని ఆ నేత పొందారు. తాను సూచించిన కర్షకుల భూములనే కొనాలంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చి మాట నెగ్గించుకున్నారు.

ఇందుకు అన్నదాతల నుంచి ఎకరాకు రూ.10-15 లక్షల వరకు ఆయా ప్రాంతాలను బట్టి వసూలుచేశారు. ఇలా 450 ఎకరాలకు రూ.45 కోట్లు వెనకేసుకున్నారు. ఒక్క భూసేకరణలోనే రూ.81 కోట్లు ఆయాచితంగా లబ్ధి పొందారు. జిల్లా మొత్తం భూసేకరణ సొమ్ములో సగం తెనాలికే కేటాయించడం గమనార్హం. ఇక్కడ ప్రభుత్వ భూములు లేకపోవడం, రాజధాని నిర్మాణ సమయంలో ఇక్కడి భూముల రిజిస్ట్రేషన్‌ విలువ పెరగడం, వైఎస్సార్సీపీ వచ్చిన తర్వాత బహిరంగమార్కెట్‌లో భూముల విలువ తగ్గడం వంటి అంశాలను ఆ నేత తనకు అనుకూలంగా మార్చుకుని అక్రమార్జనకు తెరలేపారు.

వందల ఎకరాలు కొనుగోలు చేసిన ప్రభుత్వం : పొన్నూరు పట్టణం నిడుబ్రోలులో జగనన్న కాలనీ కోసం వంద ఎకరాలను సర్కార్ కొనుగోలు చేసింది. ఆ సమయంలో కొంతమందితో రహస్యంగా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఎకరాకు రూ.5 లక్షలు ఇచ్చేలా మాట్లాడుకున్నారు. అన్నదాతల ఖాతాల్లో డబ్బులు పడిన తర్వాత ఆ డబ్బులను అక్కడి వైఎస్సార్సీపీ నేతకు అప్పట్లో అప్పగించారు. సుమారు రూ.4 కోట్లకు పైగా లబ్ధి పొందారు.

ఆవభూముల కొనుగోలు వెనుక రూ.150 కోట్ల అవినీతి : తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరం, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు రాజానగరం నియోజకవర్గం, కోరుకొండ మండలం బూరుగుపూడిలో సుమారు 586 ఎకరాలు ఆవ (ముంపు) భూములు ఎకరాకు రూ.45 లక్షల చొప్పున సేకరించారు. వాస్తవానికి వీటి ధర రూ.20 లక్షలకు మించదని స్థానిక రైతులు చెబుతున్నారు. దీంతో వైఎస్సార్సీపీ నాయకులు రూ.150 కోట్ల మేర అనుచిత లబ్ధి పొందారన్న ఆరోపణలున్నాయి.

కాకినాడ జిల్లా పిఠాపురంలోని పేదలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న నరసింగపురంలో ఒక రైతుకు చెందిన 61 ఎకరాలు సేకరించారు. మార్కెట్‌ విలువ రూ.50 లక్షలు ఉండగా రూ.62 లక్షలకు కొన్నా ఇప్పటికీ పేదలకు ఇవ్వలేదు. ఇక్కడ రూ.60 కోట్ల మేర అవినీతి జరిగింది. గొల్లప్రోలు శివారులో జగనన్న కాలనీకి మార్కెట్‌ ధర కంటే దాదాపుగా రూ.20 లక్షలు అదనంగా పెట్టి సర్కార్​తో కొనిపించారు. ఇక్కడ రూ.30 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారు. పిఠాపురం నియోజకవర్గ అప్పటి కీలక వైఎస్సార్సీపీ నేతనే ఈ అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలున్నాయి.

రైతుల ఫిర్యాదుతో అవినీతి బాగోతం వెలుగులోకి :వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పల్నాడు జిల్లాలో చక్రం తిప్పిన కీలక మహిళా ప్రజాప్రతినిధి చిలకలూరిపేట నియోజకవర్గంలో పేదల ఇళ్లస్థలాల సేకరణకు రైతుల నుంచి వసూళ్లకు పాల్పడ్డారు. అవి ఒక్కొక్కటీ వెలుగు చూస్తున్నాయి. పసుమర్రుకు చెందిన అన్నదాతలు తమనుంచి డబ్బులు వసూలు చేశారని ఫిర్యాదు చేయడంతో రూ.1.16 కోట్లను ఆమె వారికి తిరిగిచ్చారు. తాజాగా గుదేవారిపాలెం రైతుల నుంచి కూడా రూ.కోటి వసూలుచేసినట్లు వెలుగుచూసింది. వారికీ ఆ మొత్తాన్ని రెండు రోజుల్లో తిరిగి ఇచ్చేస్తామని హామీ ఇచ్చినట్టు తెలిసింది.

ఇళ్ల స్థలాలు కేటాయించారు - పట్టాలు మరిచారు

రాజకీయ విభేదాలతో ఆగిన జగనన్న ఇళ్ల స్థలాల పంపీణీ - నిరుపయోగంగా 100 ఎకరాల ప్రభుత్వ స్థలం

ABOUT THE AUTHOR

...view details