KTR Slams The Congress Govt : రెండు లక్షల రుణమాఫీ పేరిట సీఎం రేవంత్‌రెడ్డి చేసిన మోసం రైతుల పాలిట శాపంగా మారిందని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన నిర్వాకానికి రైతుల పరువు బజారున పడుతున్న పరిస్థితులున్నాయన్నారు. బ్యాంకు సిబ్బంది రైతుల ఇళ్ల మీదకు వచ్చి తలుపు తడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందని ప్రశ్నించారు.
రుణమాఫీపై ప్రగల్భాలు పలుకుతున్న ముఖ్యమంత్రికి ఇలాంటి ఘటనలే చెంప పెట్టు లాంటివని విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యం లో పేదల ఇళ్ల మీదకు బుల్డోజర్లు, రైతుల ఇళ్ల మీదకు బ్యాంకు అధికారులు వస్తున్నారని ఆక్షేపించారు. పేదలను, రైతులను కంటతడి పెట్టించే కాంగ్రెస్ మార్క్ మార్పు ఇదేనా అని నిలదీశారు. రాష్ట్రంలో కేసీఆర్ విలువ ఏంటని ఇప్పుడిప్పుడే తెలుస్తోందని వ్యాఖ్యానించారు. మారుమూల గ్రామానికి వెళ్తే ఒక రైతన్న అయ్యో కేసీఆర్‌ను వద్దనుకుని తప్పు చేశామని బాధపడుతున్నారని అన్నారు.
మరోవైపు కుల వృత్తులపై రేవంత్‌రెడ్డి ప్రభుత్వం కత్తికట్టినట్టు వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. మత్తడి దూకే చెరువుల్లో మత్స్య సంపద సృష్టించిన నిన్నటి నీలి విప్లవాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నీరుగారుస్తోందని ఆయన మండిపడ్డారు. చేప పిల్లల పంపిణీ పథకాన్ని చెడగొట్టడానికే కాంగ్రెస్ సర్కారు ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యం చేస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. ఇప్పటిదాకా చేప పిల్లల పంపిణీ మొదలు కాలేదని ఆక్షేపించారు.