KTR Question Allu Arjun Arrest : సినీ నటుడు అల్లు అర్జున్ వ్యవహారంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి స్పందించారు. సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ తప్పేంటని కేటీఆర్ మరోసారి ప్రశ్నించారు. సీఎం పేరు మరచిపోవడమే అల్లు అర్జున్ చేసిన తప్పా అని కేటీఆర్ అన్నారు. సీఎం పేరు మరచిపోయినంత మాత్రాన అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. కొడంగల్ నియోజకవర్గానికి చెందిన బీఆర్ఎస్ ముఖ్యనేలతో తెలంగాణ భవన్లో కేటీఆర్ సహా పలువురు నేతలు సమావేశమయ్యారు.
ప్రజా సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలు 15 రోజుల పాటు నిర్వహించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. ప్రభుత్వం సమయం ఇస్తే అన్ని సమస్యలపై చర్చించవచ్చు అని మీరు ఆరోపించిన స్కాములు, ఫార్ములాలు అన్నింటిని చర్చిద్దామన్నారు. సర్కార్‌కు బిల్లుల ఆమోదంపై ఉన్న శ్రద్ధ ప్రజా సమస్యల పరిష్కారంపై లేదని ఎద్దేవా చేశారు.
"అసెంబ్లీ సమావేశాలు 15 -20 రోజులు పెట్టండి, ముందుగా లగచర్ల గురించి, గురుకులాలపై, చేనేత సమస్యలు, ఆటో డ్రైవర్ల మరణాలు, వరికి బోనస్‌పై కూడా మాట్లాడదాం, మిగతా 4,5 రోజుల్లో మీరు చెబుతున్న స్కాములు, ఈ-ఫార్ములాలపై మాట్లాడదాం. ఆ సినిమా యాక్టర్ తెలంగాణ సీఎం అని పేరు మర్చిపోయాడు, పేరు మర్చిపోతే జైల్లో పెడతారా, ఇదెక్కడి అన్యాయం."- కేటీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్