KTR Fires on CM Revanth About Musi Development Fund :రూ.లక్షా యాభై వేల కోట్లతో మూసీ అభివృద్ధికి చర్యలు చేపడతామంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు సంధించారు. తొలుత రూ.50,000 కోట్లు, తర్వాత రూ.70,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి, ఇప్పుడు ఏకంగా రూ.లక్షా యాభై వేల కోట్లు అని చెప్పడం వెనక ఉద్దేశమేంటని కేటీఆర్ సామాజిక మాద్యమం ఎక్స్‌లో ప్రశ్నించారు.
తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.80 వేల కోట్లు ఖర్చు పెడితేనే గల్లీ నుంచి దిల్లీ వరకు గగ్గోలు పెట్టిన కాంగ్రెస్, ఇప్పుడు మూసీ సుందరీకరణకే రూ.1.5 లక్షల కోట్లు ఎందుకు ఖర్చు చేస్తోందన్నారు. పదిహేను పక్కన ఇన్ని సున్నాలా!! 15,000,000,000,000 అని కేటీఆర్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
లండన్ థేమ్స్ లాగా మారుస్తామనే వ్యూహం వెనక థీమ్ ఏంటి? : ఇంతకీ మూసీ ప్రాజెక్టుతో మురిసే రైతులెందరు? నిల్వ ఉంచే టీఎంసీలెన్ని? సాగులోకి వచ్చే ఎకరాలెన్ని? పెరిగే పంటల దిగుబడి ఎంత? తీర్చే పారిశ్రామిక అవసరాలెంత? కొత్తగా నిర్మించే భారీ రిజర్వాయర్లెన్ని? అని ప్రశ్నించారు. పుట్టిన గడ్డపై మమకారం లేని ముఖ్యమంత్రికి, ఎంతోమంది రైతులకు మేలు చేసే, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు కంటే మూసీ ప్రాజెక్టుపైనే ఎందుకంత మక్కువని కేటీఆర్ నిలదీశారు.