Kishan Reddy on Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం విచారణకు పూర్తిగా సహకరిస్తుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి సానుకూల వాతావరణం ఉందని అన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మహబూబ్‌నగర్ పార్లమెంటు ముఖ్య నాయకుల సమావేశంలో కిషన్ రెడ్డి పాల్గొని స్థానిక నేతలకు దిశానిర్దేశం చేశారు.
కాంగ్రెస్ బలంగా ఉన్న నల్గొండ, ఖమ్మంలోనూ బీజేపీకు సానుకూల పవనాలు వీస్తున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో(Lok Sabha Election 2024) రెండంకెల సంఖ్యలో బీజేపీ సీట్లు గెలుచుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈసారి 12 కంటే ఎక్కువ సీట్లు భారతీయ జనతా పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్‌లో విజయం బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు. అలాగే కర్ణాటలో 90 శాతం ఎంపీ సీట్లు బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో అన్ని ఎంపీ సీట్లు గెలవబోతున్నామన్నారు.
"కాంగ్రెస్, బీజేపీల మధ్యే ప్రధాన పోటీ - తెలంగాణకు బీఆర్ఎస్ అవసరం లేదు"
నాలుగు అంశాలపై బీజేపీ ఫోకస్ :మా పాలనలో నాలుగు అంశాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి పని చేస్తున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఐదేళ్లలో ఈ నాలుగు రంగాల్లో ప్రత్యేక కార్యాచరణతో బీజేపీ ముందుకు వెళుతుందని కిషన్ రెడ్డి చెప్పారు.
- మొదటిగా రైతుల అంశంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించామని అన్నారు. ప్రపంచం మొత్తంలో ఎరువుల ధరలు పెరగని ఏకైక దేశం భారత్‌నే అని చెప్పుకొచ్చారు. తెలంగాణ రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు వెంటనే ప్రారంభించారని ప్రభుత్వాన్ని కోరారు.
- రెండో ప్రాధాన్య అంశం అన్ని రంగాల్లో మహిళలను ప్రోత్సహిస్తున్నామన్నారు. పొదుపు సంఘాల ద్వారా వారికి కావాల్సిన రుణాలు ఇస్తున్నామన్నారు. అలాగే వీరికి స్కిల్ ట్రైనింగ్ ఇస్తున్నామని తెలిపారు. రానున్న ప్రతి గ్రామంలో మహిళకు డ్రోన్ అక్క పేరు మీద ఒక డ్రోన్ ఇచ్చి వారిని ఆదుకుంటామని స్పష్టం చేశారు.
- మూడో ప్రధాన అంశం అన్ని రంగాల్లో పేదవారిని ఆదుకునే విధంగా ప్రణాళికలను సిద్ధం చేశామని తెలిపారు. ఆయుష్మాన్ భారత్, నల్లా ద్వారా ప్రతి పేదవాడి ఇంటికి తాగునీరు, టాయిలెట్లు ఏర్పాటు వంటి అనేక అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు.
- నాలుగో అంశం ఉద్యోగం, ఉపాధి అంశాల్లో యువతకు అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. నూతన విద్యావిధానం తీసుకువచ్చి వారికి సులువుగా సిలబస్ అర్థమయ్యే విధంగా చేస్తున్నామని వివరించారు. అందుకు గానూ వారు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగుపర్చుకునేలా చేస్తున్నామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేసినా రాష్ట్రంలో బీజేపీకి రెండంకెల సీట్లు వస్తాయి : కిషన్ రెడ్డి
"కేసీఆర్ పాలన అంకెల గారడీ అయితే, కాంగ్రెస్ పాలన అంకెల గారడీతోపాటు మాటల గారడీ"