KCR Meeting with BRS Leaders on MP Elections : భారత రాష్ట్ర సమితి మాత్రమే రాజీలేని పోరాటాలతో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుందని ఆ పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణను సాధించి పదేళ్ల అనతికాలంలో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతి పథంలో నడిపించి దేశానికి ఆదర్శంగా నిలిపిందని గుర్తు చేశారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో సమావేశమైన ఆయన, పలు అంశాలపై నేతలతో చర్చించారు. పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన కార్యాచరణ, సంబంధిత అంశాలపై కేసీఆర్ సూచనలు చేశారు. శానససభ ఎన్నికల్లో ఓటమి పాలైనందుకు నిరుత్సాహ పడాల్సిన, భయపడాల్సిన అవసరం లేదన్న ఆయన, ప్రతిపక్ష పాత్ర సమర్థంగా నిర్వహిద్దామని, ప్రజల పక్షాన బలంగా పోరాడదామని నేతలకు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఇచ్చిన హామీలు అమలు చేయలేదని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందా, ఉండదా అనేది ఆ పార్టీ నేతల చేతుల్లోనే ఉందని కేసీఆర్ అన్నట్లు సమాచారం.
బీఆర్ఎస్ను బొంద పెడతామని కాంగ్రెస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యల్ని ప్రజలు గమనిస్తున్నారని కేసీఆర్ అన్నారు. తాను అన్ని రకాలుగా తోడ్పాటు అందిస్తానని, లోక్ సభ ఎన్నికల్లో గట్టిగా పోరాడదామని నేతలకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే, లోక్ సభ ఎన్నికల్లో మంచి ఫలితాలు, మెరుగైన సీట్లు వస్తాయని సర్వేలు చెబుతున్నట్లు ఆయన వ్యాఖ్యానించినట్లు తెలిసింది.