KCR Bus Yatra In Telangana : లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటికే ప్రారంభించిన భారత్ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ నేటి నుంచి బస్సుయాత్ర చేపట్టనున్నారు. ఇప్పటికే కరీంనగర్, చేవెళ్ల, మెదక్ బహిరంగ సభల్లో పాల్గొన్న ఆయన ఇవాళ్టి నుంచి రోడ్ షోల ద్వారా ప్రచారాన్ని మరింత ముమ్మరం చేయనున్నారు. మిర్యాలగూడతో ప్రారంభించి లోక్ సభ నియోజకవర్గాల వారీగా రోడ్ షోలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తెలంగాణ భవన్ నుంచి ఆయన బస్సు యాత్రకు శ్రీకారం చుడతారు.
KCR Election Campaign In Telangana : తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల సమర్పించిన తర్వాత కేసీఆర్ బస్సుయాత్ర ప్రారంభిస్తారు. బీఆర్ఎస్ నేతలు భారీ ర్యాలీగా వెళ్లనున్నారు. ఉప్పల్, ఎల్బీనగర్, చౌటుప్పల్, నల్గొండ, మాడుగులపల్లి మీదుగా మిర్యాలగూడ వెళ్లనున్న గులాబీ దళపతి సాయంత్రం అక్కడ రోడ్ షోలో ప్రసంగిస్తారు. అనంతరం రాత్రి ఏడు గంటలకు సూర్యాపేట రోడ్ షోలో పాల్గొంటారు. మొత్తం 17 రోజుల పాటు 12 లోక్‌సభ నియోజకవర్గాల్లో కేసీఆర్ రోడ్ షోలు నిర్వహిస్తారు. చివరి రోజైన మే పదో తేదీన సిరిసిల్లలో రోడ్ షో, సిద్దిపేటలో బహిరంగసభ నిర్వహించి ముగిస్తారు.
కేసీఆర్ రోడ్ షో : హైదరాబాద్, సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి, ఆదిలాబాద్ మినహా మిగిలిన నియోజకవర్గాల్లో రోడ్ షోలు జరగనున్నాయి. రోడ్ షోలలో భాగంగా ఉదయం సాగుదారుల సమస్యల మీద క్షేత్రస్థాయిలో పర్యటించి ఎండిన పంట పొలాలు, ధాన్యం కల్లాలను సందర్శిస్తూ, రైతులను పరామర్శిస్తూ, వారి కష్టనష్టాలను తెలుసుకోనున్నారు. సాయంత్రం పూట లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో కేసీఆర్ రోడ్ షోలు జరగనున్నాయి. 17 రోజుల పాటు జరగనున్న బస్సుయాత్ర, అదీ వేసవి కావడంతో అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.