Jogi Ramesh came to Mangalagiri Police Station: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఇంటిపై దాడి చేసిన కేసులో వైఎస్సార్సీపీ మాజీ మంత్రి జోగి రమేశ్ పోలీసులు విచారణకు హాజరయ్యారు. మంగళగిరి గ్రామీణ పోలీస్ స్టేషన్లో జరిగిన విచారణకు జోగి రమేశ్ తన న్యాయవాదితో కలిసి పాల్గొన్నారు. దాడి రోజు జోగి రమేశ్ వినియోగించిన సెల్‌ఫోన్, వాహనాల వివరాలను పోలీసులకు అందజేశారు. తాను చంద్రబాబు నాయుడుకి నిరసన తెలియజేసేందుకు వెళ్లాను తప్ప ఎలాంటి దాడికి యత్నించలేదని జోగి రమేశ్ చెప్పారు.
ఆ సమయంలో అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబుకు తన నిరసనను తెలిపేందుకు అనుచరులతో అక్కడికి వెళ్లానన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని జోగి రమేశ్ తెలిపారు. అగ్రిగోల్డ్ భూములు తెలియక కొన్నామని అందులో, తమ కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని రమేశ్ వెనకేసుకొచ్చారు. త్వరలోనే అన్ని వివరాలను మీడియా ముందు ఉంచుతానని అన్నారు.
కాగా వైఎస్సార్సీపీ పాలనలో ఆ పార్టీ నేతలు అరాచకాలకు పాల్పడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటుతో భయంతో కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కోర్టులలో వరుసగా పిటిషన్లు వేస్తున్నారు. 2021వ సంవత్సరంలో ఉండవల్లిలోని నారా చంద్రబాబు నాయుడు ఇంటిపై జోగి రమేశ్, ఆయన అనుచరులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. అయితే ఈ ఘటనలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ జోగి రమేశ్ హైకోర్టులో పిటిషన్ వేశారు.
జోగి రమేశ్ పిటిషన్‌పై హైకోర్టు విచారణ సైతం జరిగింది. ఇదిలా ఉండగా, మరోవైపు ఇదే కేసులో మంగళగిరి డీఎస్పీ ఎదుట విచారణకు హాజరుకావాలంటూ తాడేపల్లి పోలీసులు జోగి రమేశ్‌కి కొద్ది రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు. 2021 సెప్టెంబర్ 17న ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు ఇంటిపైకి జోగి రమేశ్ తన అనుచరులతో కలిసి దాడికి వెళ్లారు. అడ్డుకున్న తెలుగుదేశం పార్టీ శ్రేణులపైనా దాడికి తెగబడ్డారు. అయితే ఈ ఘటనలో ఇరు వర్గాలపైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు పేర్కొన్నారు.