Janasena Pawan Kalyan Meet Christian Leaders: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తన స్వార్థం కోసం మతాన్ని వాడుకునే వ్యక్తే తప్ప వాటి పద్ధతులను పాటించే వ్యక్తి కాదని పవన్ కల్యాణ్ ఆరోపించారు. సీఎం జగన్ నిజంగా క్రైస్తవ ఆచారాలు పాటిస్తే రాష్ట్రాన్ని ఇలా ఇబ్బందులపాలు చేసేవారు కాదని అన్నారు. మానవత్వంతో నిలబడే వ్యక్తికి మతం ఉండదని, ఎవరైతే తన మతాన్ని ప్రేమించి, ఇతర మతాలను గౌరవిస్తారో అలాంటి వారే ప్రజలకు న్యాయం చేయగలరన్నారు.
గురువారం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన క్రైస్తవ మత పెద్దలతో పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ మత పెద్దలు పవన్ కల్యాణ్ క్షేమాన్నీ, విజయాన్నీ కాంక్షిస్తూ ప్రార్థనలు చేశారు.
యువత అండతోనే వైఎస్సార్సీపీతో పోరాటం - 'గ్లాసు టీ' సమావేశంలో పవన్ కల్యాణ్
తాను అన్ని మతాలనూ సమానంగా గౌరవిస్తాను కాబట్టే మత ప్రస్తావన లేని రాజకీయం అనే సిద్ధాంతాన్ని చేర్చామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొందరు రాజకీయ నాయకులు సెక్యులరిజం అనే పదాన్ని ఓటు బ్యాంకు రాజకీయాలకు వాడుకుంటున్నారని పవన్ చెప్పారు. జగన్ హయాంలో 517 దేవాలయాలు అపవిత్రమయ్యాయని, దీనికి సంబంధించిన దోషులను పట్టుకోకపోతే పాలకుడు అన్య మతస్తుల పక్షం వహిస్తున్నారనే భావన హిందువులకు కలుగుతుందని చెప్పారు.
క్రైస్తవుల మనోభావాలకు, ప్రాథమిక హక్కులకు విఘాతం కలిగితే జనసేన తరఫున తాను అండగా నిలబడతానని హామి ఇచ్చారు. జగన్‌రెడ్డిలా తాను మాటలు చెప్పే వ్యక్తిని కాదని పవన్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 97 వేల మంది పాస్టర్లకు గౌరవ వేతనం ఇస్తామని చెప్పి ఇప్పుడు 8,500 మందికి మాత్రమే ఇస్తున్నారు. జనసేన పార్టీ క్రైస్తవులకి ఎప్పటికీ వ్యతిరేకం కాదన్నారు. ఇంట్లో క్రిస్మస్ వేడుకలు, క్రైస్తవ ప్రార్థనలు చేస్తామని తెలిపారు.
వైఎస్సార్సీపీకి ఓటమి కళ్లెదుట కనిపిస్తోంది - అందుకే కొందరు కాపు పెద్దలను రెచ్చగొడుతోంది: పవన్
క్రిస్టియన్లకు గౌరవం ఇవ్వడం అనే అంశాన్ని మా ఇంటి నుంచే మొదలుపెడతానని పేర్కొన్నారు. తాను బీజేపీతో సన్నిహితంగా ఉండటం వల్ల క్రిస్టియన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతానని ప్రచారం చేశారని, సీఎం జగన్ మాత్రం పీఎం మోదీ దగ్గరకు వెళ్లిన ప్రతిసారీ వెంకటేశ్వర స్వామి ఫోటోలే తీసుకువెళ్తారని గుర్తు చేశారు. జగన్ క్రైస్తవ మతాన్ని వాడుకుంటున్నారని, అవసరాన్ని బట్టి హిందూయిజాన్ని వాడుకుంటున్నారని చెప్పారు. తాను అలా చేయనని స్పష్టం చేశారు.
నిమ్నవర్గాలకు కేటాయించిన నిధులు క్రైస్తవులకు ఎందుకు అందడం లేదో విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చారు. క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి కమిటీ వేస్తానని పవన్ వెల్లడించారు. కోనసీమ వచ్చినప్పుడు ప్రత్యేకంగా సమయం కేటాయించి క్రైస్తవులతో మాట్లాడతానని తెలిపారు. దేవాలయాలపై దాడులు జరిగితే ఎలా స్పందిస్తానో, మసీదు, చర్చిలపై దాడులు జరిగినా అదే విధంగా స్పందిస్తానని అన్నారు. వచ్చే ఎన్నికల్లో నిజాయతీ, సత్యం వైపు నిలబడాలని మతపెద్దలకు పవన్ సూచించారు.
ఎంత బలంగా ఉన్నామో జగన్‌లోని భయమే చెప్తోంది : పవన్