Memories with Ratan Tata : ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా శ్రీవారి భక్తుడు. ఆయనకు తిరుమల, తిరుపతితో ప్రత్యేక అనుబంధం ఉంది. నిత్యం కోట్లాది మంది భక్తులు తరలివచ్చే తిరుమల తిరుపతిలో శ్రీవారి సేవలకు ఎలాంటి ఆటంకాల్లేకుండా సాంకేతిక సొబగులు అద్దడంలో అండగా నిలిచారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు టీటీడీ బోర్డుతో కలిసి అడుగులు వేశారు.
ఎనిమిదేళ్లుగా టీసీఎస్ సేవలు...
శ్రీవారి సేవలు మరింత పారదర్శకంగా కొనసాగేలా ఆన్‌లైన్ సేవలు అందించడంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్)ది కీలకపాత్ర. టీటీడీకి ఉచితంగా సాఫ్ట్‌వేర్ సేవలను అందించే ఒప్పందం ఓ మైలురాయిగా చెప్పుకోవచ్చు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చొరవతో పూర్వపు ఈవో సాంబశివరావు హయాంలో ఇది సాకారం కాగా టీటీడీకి అవసరమైన సాఫ్ట్‌వేర్ సేవలు, ఉద్యోగులను టీసీఎస్ సమకూర్చింది. ఆన్‌లైన్, కరెంట్ బుకింగ్‌లో టికెట్ల జారీ, గదుల కేటాయింపు, నగదు చెల్లింపులు తదితర అనేక సేవలను ఎనిమిదేళ్లుగా టీసీఎస్ అందిస్తోంది. ఏడాదికి సుమారు రూ.12 కోట్ల విలువచేసే సేవలను టీసీఎస్ అందించడం టాటా సేవా నిరతికి నిదర్శనం. 2018లో నిజపాద దర్శన సేవలో శ్రీవారిని రతన్‌టాటా దర్శించుకోగా ఆయనతోపాటు టాటా గ్రూప్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ కూడా వెంట ఉన్నారు.
స్వీకార్‌కు శ్రీకారం
అత్యంత ప్రాణాంతకమైన క్యాన్సర్ నుంచి పేద ప్రజలను కాపాడేందుకు అధునాతన వైద్య సేవలను టాటా ట్రస్టు తిరుపతిలో అందుబాటులోకి తీసుకువచ్చింది. శ్రీవారి పాదాల చెంత 25 ఎకరాల స్థలంలో రూ.250 కోట్ల వ్యయంతో శ్రీ వేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ సెంటర్ (స్వీకార్)ను ఏర్పాటు చేసింది. అంతే కాదు టాటా ట్రస్టు దేశంలో ఐదుచోట్ల రూ.1800 కోట్ల వ్యయంతో క్యాన్సర్ ఆస్పత్రులకు శ్రీకారం చుట్టింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు అభ్యర్థనతో నామమాత్రపు లీజుతో టీటీడీ విలువైన స్థలాన్ని టాటా ట్రస్టుకు కేటాయించగా 2018 ఆగస్టు 31న చంద్రబాబు నాయుడుతో కలిసి రతన్ టాటా భూమిపూజ చేశారు.
ప్రారంభంలో పది పడకలతో కీమోథెరపీ సేవలను అందుబాటులోకి తీసుకువచ్చారు. ప్రస్తుతం వంద పడకల ఆస్పత్రిగా సేవలందిస్తోంది. ఓపీ సంఖ్య 300 నమోదు అవుతుండగా నెలకు 1,100 వరకు కీమోలు, రోజూ 85 మందికి రేడియోథెరపీ చేస్తున్నారు. ప్రతినెలా సరాసరి 130 మేజర్ శస్త్రచికిత్సలు నిర్వహిస్తూ రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రజలకు టాటా క్యాన్సర్ ఆస్పత్రి ఓ వరంగా నిలిచింది.