HC on Jogi Ramesh Anticipatory Bail Petition: గత వైఎస్సార్సీపీ పాలనలో అరాచకాలకు తెగబడిన ఆ పార్టీ నేతలు ఇప్పుడు కేసుల భయంతో కోర్టుల నుంచి శరణు కోరుతున్నారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కోర్టులలో వరుస పిటిషన్లు వేస్తున్నారు. 2021లో ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటిపై మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన అనుచరులు రాళ్లతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో తాడేపల్లి పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ హైకోర్టులో జోగి రమేష్ పిటిషన్ దాఖలు చేశారు. జోగి రమేష్ పిటిషన్‌పై హైకోర్టు నేడు విచారణ జరిపింది. తదుపరి విచారణను ఈ నెల 22 కి వాయిదా వేసింది.
మరోవైపు ఇవాళ ఇదే కేసులో మంగళగిరి డీఎస్పీ ఎదుట విచారణకు హాజరుకావాలని తాడేపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. 2021 సెప్టెంబర్ 17న ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంపైకి జోగి రమేష్ తన అనుచరులతో కలిసి దాడికి వెళ్లారు. అడ్డుకున్న టీడీపీ శ్రేణులపై దాడికి తెగబడ్డారు. అయితే ఈ వ్యవహారంలో పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగినట్లు కేసులు పెట్టారు.
జోగి రమేష్ డ్రైవర్ రాము ఇచ్చిన ఫిర్యాదు మేరకు టీడీపీ నేతలపై ఎస్సీ అట్రాసిటీ సెక్షన్లు నమోదు చేశారు. టీడీపీ నేత సాంబశివరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జోగి రమేష్తో పాటు ఆయన అనుచరులపై మరో కేసు నమోదైంది. ఈ కేసులకు సంబంధించి అప్పట్లో టీడీపీ నేతలను అరెస్టు చేసిన పోలీసులు వైఎస్సార్సీపీ నేతల జోలికి మాత్రం వెళ్లలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కేసు విచారణ తిరిగి ప్రారంభమైంది.