Harish Rao comments on Congress in BRS meeting :'అసెంబ్లీ ఎన్నికల్లో పేదలకు ఇచ్చిన హామీ నెరవేర్చు రేవంత్ రెడ్డి, పేగులు మెడలో వేయాల్సిన అవసరం లేదు' అంటూ బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు సీఎంపై విమర్శలు గుప్పించారు. వందరోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఉద్దర మాటలు తప్ప ఉద్ధరించే పనులు చేయలేదని మండిపడ్డారు.
ఇవాళ సిద్దిపేట జిల్లాలోని మెదక్ పార్లమెంట్ ఎన్నికల గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. టీవీలో, సామాజిక మాధ్యమాల్లో, న్యూస్ పేపర్లలో లీకులు తప్ప, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఎత్తాల్సింది పార్టీ గేట్లు కాదని, ప్రాజెక్టుల గేట్లు ఎత్తి రైతాంగానికి నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Harish Rao on BJP and ED :ఎవరికీ ఏ కష్టం వచ్చిన తాము అండగా ఉంటామని, ముమ్మాటికీ మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు. కొంత మంది అవకాశ వాదులను, బీఆర్ఎస్ను వదిలి వెళ్లిన వారిని తిరిగి పార్టీలో ఆహ్వానించేది లేదని తేల్చి చెప్పారు. బీజేపీతో కలిస్తే జోడీ లేదంటే ఈడీ అని విమర్శించారు. ఆ పార్టీలోకి వెళ్లగానే వాషింగ్ పౌడర్లాగా అన్ని క్లీయర్ అని, లేదంటే ఈడీ రైడ్ అని ఎద్దేవా చేశారు. బీజేపీతోనే అధిక ధరలు, పేదరికం, నిరుద్యోగిత పెరిగిందనన్నారు. ఆరు గ్యారెంటీలు అమలు కావాలంటే కాంగ్రెస్ ఓడించాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేవుని ముందు అందరూ సమానులేనన్న ఆయన, బీజేపీ మాత్రం దేవుడి పేరుతో ఎన్నికల్లో వాడుకుంటోందని విమర్శించారు.
'రాష్ట్రానికి బీజేపీ ఏం ఇచ్చింది. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాం అని ఇవ్వలేదు. నల్ల చట్టాలను తెచ్చి రైతులను పొట్టనపెట్టుకున్న పార్టీ బీజేపీ. అనేక రకాలుగా దేశ ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది.'- హరీశ్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి