Police Case on Ambati Rambabu and YSRCP Leaders:మాజీ మంత్రి అంబటి రాంబాబుతో సహా పలువురు వైఎస్సార్సీపీ నేతలపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. నగరంలోని పట్టాభిపురం ఠాణాలో మెట్లపై బైఠాయించి బిగ్గరగా నినాదాలు చేస్తూ విధులకు ఆటంకం కలిగించినందుకు మాజీ మంత్రి అంబటి రాంబాబుతో సహా పలువురు వైఎస్సార్సీపీ నాయకుల మీద కేసు నమోదైంది. హెడ్ కానిస్టేబుల్ చంగల రాయుడు ఈ మేరకు ఫిర్యాదు చేశారు.
తాము ఇచ్చిన ఫిర్యాదులపై పోలీసులు కేసు నమోదు చేయడం లేదంటూ మంగళవారం వైఎస్సార్సీపీ నాయకులు పట్టాభిపురం ఠాణా వద్దకు చేరుకుని ప్లకార్డులు చేతపట్టుకుని నిరసన తెలిపారు. మెట్లపై కూర్చుని ఫిర్యాదిదారులను లోపలకు వెళ్లనివ్వకుండా, పోలీసుల్ని బయటకు వెళ్లనివ్వకుండా విధులకు ఆటంకం కలిగించినందుకు అంబటితో పాటు మిర్చియార్డు మాజీ ఛైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, డిప్యూటీ మేయర్ బాల వజ్రబాబు, షేక్ నూరి ఫాతిమా, అంగడి శ్రీనివాసరావు, చదలవాడ వేణు, భగవాన్ తదితరులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.