AP Nominated Posts 2024 :కూటమి పార్టీల ఆశావాహులు ఎప్పుడెప్పుడా అనే ఎంతో ఆశగా చూస్తున్న నామినేటేడ్ పదవుల తొలి జాబితా విడుదల అయ్యింది. 20 కార్పేరేషన్ లకు ఛైర్మన్లతో పాటు, సభ్యులు,డైరెక్టర్లు కలిపి మొత్తం 99 మందిని నియమించారు. ఇటీవల రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌గా పి. కృష్ణయ్య నియామకంతో కలిపితే 100 రోజుల పాలనలో భాగంగా 100 పదవులు భర్తీ చేసినట్లైంది. 11 మంది క్లస్టర్ ఇంచార్జ్‌లకు పదవులు దక్కాయి.
20 కార్పొరేషన్లకు ఛైర్మన్లు, ఒక కార్పొరేషన్‌కు వైస్ ఛైర్మన్, వివిధ కార్పొరేషన్ల సభ్యులను ప్రకటించిన కూటమి ప్రభుత్వం 99 పదవుల్లో యువతకు చోటు ఇచ్చింది. కార్పొరేషన్ చైర్మన్లుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ముఖ్యమంత్రి ప్రాధాన్యం కల్పించారు.
20మంది కార్పొరేషన్ చైర్మన్ల నియామకం (ETV Bharat) రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తాజాగా ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో తెలుగుదేశం అధిష్టానం అసలు సిసలైన కార్యకర్తలకు అగ్ర తాంబూలం ఇచ్చింది. పార్టీ కోసం క్షేత్ర స్థాయిలో కష్టపడిన సామాన్య కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పదవులు కట్టబెట్టారు. సామాజిక సమతూకం పాటిస్తూ సోషల్ ఇంజనీరింగ్‌తో తొలి విడత ప్రకటించిన పదవులపై పార్టీ క్యాడర్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.
రఘురామ కృష్ణంరాజు కోసం సీటు త్యాగం చేసిన అప్పటి సిటింగ్ ఎమ్మెల్యే మంతెన రామరాజుకు కీలకమైన ఏపీఐఐసీ చైర్మన్ పదవి లభించింది. మాజీ ఎంపీ, విసి నేత కొనకళ్ల నారాయణరావుకు కీలకమైన ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ పదవి లభించింది. అలాగే యువగళం పాదయాత్రలో వాలంటీర్స్ కోఆర్డినేటర్‌గా పనిచేసిన అనిమిని రవి నాయుడుకు శాప్ చైర్మన్ పదవి, మంగళగిరిలో పార్టీ విజయం కోసం కృషి చేసిన సీనియర్ బీసీ నేత నందం అబద్దయ్యకు పద్మశాలి కార్పొరేషన్, ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన మాజీమంత్రి పీతల సుజాతకు వినియోగదారుల కౌన్సిల్ చైర్మన్, మాదిగ సామాజిక వర్గ ప్రముఖుడు పిల్లి మాణిక్యాలరావుకు లెదర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవులు లభించాయి.
పొత్తు కారణంగా సీటు కోల్పోయిన అనకాపల్లికి చెందిన పీలా గోవింద్ సత్యనారాయణకు అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవితో న్యాయం చేశారు. ఉత్తరాంధ్ర పార్టీ కోఆర్డినేటర్‌గా పనిచేసిన దామచర్ల సత్యకు కీలకమైన మారిటైం బోర్డు చైర్మన్ పదవి లభించింది. రాష్ట్రంలో ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యసాధనలో కీలకం కానున్న సీడాప్ చైర్మన్ పదవిని సీనియర్ నేత గునుపాటి దీపక్ రెడ్డికి ఇచ్చారు.
పొత్తు కారణంగా సీటు కోల్పోయిన నెల్లిమర్లకు చెందిన బీసీ నేత కర్రోతు బంగార్రాజుకు మార్క్ ఫెడ్ చైర్మన్ పదవితో న్యాయం చేశారు. ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు, బీసీ నేత నూకసాని బాలాజీకి కీలకమైన టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి లభించింది. మలిజాబితాపైనా ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేశారు.