KTR on CM Revanth about Musi River Project : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వైఖరి మింగ మెతుకు లేదు కానీ, మీసాలకు మాత్రం సంపెంగ నూనె కావాలి అన్నట్లు ఉందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆక్షేపించారు. ఈ మేరకు సీఎం రేవంత్‌పై ఎక్స్ వేదికగా ఆయన విమర్శలు గుప్పించారు. రాష్ట్రం అప్పుల పాలైందని, డబ్బులు లేవని తెల్లారిలేస్తే బీద అరుపులు అరుస్తున్నారని మండిపడ్డారు. మరొకవైపు మూసీ పేరిట లక్షా యాభై వేల కోట్ల రూపాయల సోకులు, ఆర్భాటం ఎవరికోసమని ప్రశ్నించారు. రైతు రుణమాఫీకి డబ్బులు లేవు, రైతుబంధుకు డబ్బులు లేవని విమర్శించారు. రైతు కూలీలకు డబ్బులు లేవు, కౌలు రైతులకు డబ్బులు లేవన్న ఆయన, నిరుద్యోగ భృతికి డబ్బులు లేవని, పేదవాళ్లకు పెన్షన్లకు డబ్బులు లేవని పేర్కొన్నారు.
మహిళలకు మహాలక్ష్మి పథకం అమలుకు డబ్బులు లేవని, ఆడపిల్లలకు స్కూటీలకు డబ్బులు లేవని కేటీఆర్ ఎక్స్‌లో విమర్శించారు. ఉద్యోగస్తులకు డీఏలకు డబ్బులు లేవని, మున్సిపాలిటీల్లో పారిశుధ్య కార్మికులకు జీతాలకు డబ్బులు లేవని ఆరోపించారు. గ్రామాల్లో పిచికారీ మందులకు డబ్బులు లేవన్న ఆయన, బడిపిల్లలకు చాక్ పీసులకు కూడా డబ్బులు లేవని, దవాఖానలో మందులకు డబ్బులు లేవని పేర్కొన్నారు. దళితబందుకు డబ్బులు లేవని, విద్యార్థుల స్కాలర్‌షిప్‌లకు డబ్బులు లేవని ఆరోపించారు. విద్యార్థుల ఫీజు రీఎంబర్స్‌మెంట్‌కు డబ్బులు లేవని, తులం బంగారం ఇవ్వడానికి డబ్బులు లేవని అన్నారు. చెరువుల్లో చేపపిల్లలు పెంచడానికి డబ్బులు లేవన్న కేటీఆర్, రెండో విడత గొర్రెల పంపిణీకి డబ్బులు లేవని ఆరోపించారు.