ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : 5 hours ago

ETV Bharat / politics

జగన్ తిరుమల పర్యటన రద్దు వెనుక నాటకీయ పరిణామాలు - Jagan Tirupati Tour

Jagan Tirupati Tour : తీవ్ర ఉత్కంఠ నడుమ జగన్ తిరుమల పర్యటన రద్దుకు కొన్ని గంటల ముందు నాటకీయ పరిణామాలు చోటు చేసుకొన్నాయి. హిందూ ధార్మిక సంఘాల ఆందోళనతో పోలీసు ఆంక్షలు ఓ వైపు, వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నెలకొన్న గందరగోళం మరోవైపు. ఈ పరిస్థితుల్లోనే తిరుమలలో డిక్లరేషన్ పై సంతకం పెట్టలేని సంకట పరిస్థితుల్లో జగన్ పర్యటన రద్దు చేసుకొన్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

jagan_tirupati_tour_cancel
jagan_tirupati_tour_cancel (ETV Bharat)

Jagan Tirupati Tour : తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన మాజీ ముఖ్యమంత్రి జగన్‌ పర్యటన రద్దైంది. తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో వినియోగించే నెయ్యి కల్తీ వివాదం నేపథ్యంలో హిందూ ధార్మిక సంఘాలు, సాధుపరిషత్‌ సభ్యులు జగన్‌ పర్యటనను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టాయి. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు 30 పోలీస్‌ యాక్ట్‌ అమల్లోకి తెచ్చారు. మరో వైపు జగన్‌ పర్యటనను వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోలీసులు నేతలకు నోటీసులు జారీ చేశారు. ఉద్రిక్తతలు కొనసాగుతున్న తరుణంలో జగన్ తిరుమల పర్యటన వెళ్లాలని నిశ్చయించుకోవడం, డిక్లరేషన్ అంశం తెరపైకి రావడంతో కొన్ని గంటల సమయంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకొన్నాయి. పోలీసు ఆంక్షలతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో నెలకొన్న భయం, తిరుమలలో డిక్లరేషన్ పై సంతకం పెట్టలేని సంకట పరిస్థితుల్లో జగన్ పర్యటన రద్దు చేసుకొన్నారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

శ్రీవారిని దర్శించుకోవాలంటే జగన్ డిక్లరేషన్ ఇవ్వాల్సిందే : శ్రీనివాసానంద సరస్వతి - Srinivasananda Saraswati on Jagan

వైఎస్సార్సీపీ పాలన అసమర్థ, అవినీతి చర్యలతో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అయ్యిందంటూ హిందూ ధార్మిక సంఘాలు, సాధు పరిషత్‌లు ఆందోళనలు ఓ వైపు కొనసాగుతుండగా మరో వైపు మాజీ ముఖ్యమంత్రి జగన్‌ తిరుమల పర్యటన చేపట్టడం అగ్గికి ఆజ్యం పోసిన విధంగా మారింది. టీటీడీ ఛైర్మన్లు వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో టీటీడీ భ్రష్టు పట్టిపోయిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నా ఇవేమీ పట్టనట్లు జగన్‌ తిరుమల పర్యటనకు రావాలనుకోవడంతో వివాదం తీవ్రమైంది.

దేశవ్యాప్తంగా తిరుమల లడ్డీ కల్తీ వ్యవహారం దుమారం రేగడంతో పాటు.... వైఎస్సార్సీపీ నాయకులపై ప్రధానంగా మాజీ ముఖ్యమంత్రి జగన్ పై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. వారం రోజులుగా దేశవ్యాప్తంగా హిందూ సంఘాలు, కూటమి నేతలు చేస్తున్న విమర్శలను తిప్పికొట్టే సాహసం చేయలేక ఆత్మరక్షణలో పడిన జగన్ మోహన్ రెడ్డి నష్ట నివారణలో భాగంగా తిరుమల పర్యటన చేపట్టారన్న అభిప్రాయం ధార్మిక సంఘాల్లో నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి తిరుమలకు వెళ్తానని రెండు రోజుల కిందట ప్రకటించారు. ఇవాళ మధ్యాహ్నం గన్నవరం నుంచి రేణిగుంటకు ప్రత్యేక విమానంలో రానున్నట్లు ప్రకటించారు. తిరుపతిలో హైందవసంఘాలు, రెండు రాష్ట్రాల నుంచి వచ్చిన స్వామీజీలు జగన్ పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ తిరుమలకు వచ్చే అర్హత లేదని, అన్య మతస్తులకు చోటు లేదంటూ భీష్మించాయి.

జగన్ తిరుమలకు వస్తే దేవాదాయశాఖ తిరుమల శ్రీవారిపై విశ్వాసం ఉందంటూ డిక్లరేషన్ పత్రంపై సంతకం పెట్టాలని కూటమి నేతలు, హైందవ సంఘాలు పట్టుబట్టాయి. హిందూ ధార్మిక సంఘాలు, రాజకీయ పక్షాలతో పాటు పీసీసీ అధ్యక్షురాలు షర్మిల లడ్డు వివాదంలో తన సోదరుడు జగన్‌పై విమర్శలు గుప్పించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో లడ్డూకు వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని షర్మిల ఆక్షేపించారు. అన్ని వైపుల నుంచి జగన్ పై మూకుమ్మడి దాడి జరగడంతో ఆత్మరక్షణలో పడిన జగన్ తిరుమల పర్యటన రద్దు చేసుకోవాల్సి వచ్చింది. మరోవైపు తిరుపతితోపాటు పొరుగు జిల్లాలైన ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాల నుంచి తిరుమలకు వెళ్లాలనుకున్న వైఎస్సార్సీపీ నేతలకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. 30యాక్టు అమలులో ఉన్నందున తిరుపతికి గుంపులుగా వెళ్లకూడదని పోలీసులు నోటీసులు జారీ చేశారు. రేణిగుంట విమానాశ్రయం వద్ద జగన్ కోసం కాన్వాయ్ కూడా సిద్ధం చేశారు. ఇవన్నీ జగన్ కు ఇబ్బందిగా మారడంతో గత్యంతరం లేని స్థితిలో పర్యటన రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

సంతకం పెట్టిన తర్వాతనే శ్రీవారిని దర్శించుకోవాలంటూ ఆందోళనలు తీవ్రం చేశారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే అన్యమతస్థులు పాటించాల్సిన నిబంధనలు, అనుసరించాల్సిన సంప్రదాయాల వివరాలతో తిరుమలలో తితిదే బోర్డులు ఏర్పాటు చేసింది. హైందవేతరులు ఆలయం ప్రవేశం చేయాలంటే తప్పనిసరిగా డిక్లరేషన్ పై సంతకం పెట్టాలన్న నిబంధనలను సూచిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. ఓ వైపు ధార్మిక సంఘాల నిరసనలు మరో వైపు తిరుమల శ్రీవారి దర్శనానికి డిక్లరేషన్‌ ఇవ్వాల్సిన సందిగ్ధ పరిస్థితుల్లో జగన్ తన పర్యటన రద్దు చేసుకొన్నారు. జగన్‌ పర్యటన రద్దు చేసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామమని, ఇకపై తిరుమల శ్రీవారి దర్శనానికి ఎప్పుడు వచ్చినా తిరుమల సంప్రదాయాలను అనుసరించి డిక్లరేషన్‌పై సంతకం చేసి దర్శనానికి వెళ్లాలని ఆంధ్రప్రదేశ్‌ సాధుపరిషత్‌ సభ్యులు అభిప్రాయపడుతున్నారు.

మానవత్వం తన మతం అని చెప్పిన జగన్ మోహన్ రెడ్డి ఆలయాల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ప్రజలు పూజలు చేయాలని చెబుతున్నారు కానీ, ఆయన ఎందుకు పూజలు చేయరని ప్రశ్నించారు. దళితులు కూడా టీటీడీలో పనిచేస్తున్నారనే విషయం గుర్తించుకోవాలన్నారు. కూటమి నేతలు కూడా జగన్ పర్యటనను అడ్డుకోబోమని.. అయితే డిక్లరేషన్ పై సంతకం పెట్టాల్సిందేనని స్పష్టం చేశారు.

ప్రతిఒక్కరూ టీటీడీ నిబంధనలు పాటించాల్సిందే: సీఎం చంద్రబాబు - CM Chandrababu On TTD Declaration

తక్కువ ధరకు కోట్ చేసిన వారికే నెయ్యి కాంట్రాక్టు- NDBB నివేదికలో కచ్చితత్వం లేదు: జగన్ - Jagan tirupati tour cancelled

ABOUT THE AUTHOR

...view details