DK Aruna Fires on CM Revanth Reddy :మహబూబ్‌నగర్ పార్లమెంట్ ఎన్నికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన ఓటమిని ఒప్పుకున్నారని బీజేపీ అభ్యర్థి డీకే అరుణ అన్నారు. అభద్రతాభావం వారిని వెంటాడుతున్నందునే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని ఆమె నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన డీకే అరుణ, ముఖ్యమంత్రి ఇంకా ప్రతిపక్ష నేతగానే (Opposition Leader) మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రజలు రేవంత్ రెడ్డిని చూసి ఓటేయలేదు - డీకే అరుణ - Lok Sabha Election 2024
మహిళ అనే గౌరవం లేకుండా నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. డీకే అరుణ పేరు తీసే అర్హత కూడ లేదని, దొరసాని అనే మాట మాట్లాడినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాజకీయంగానే హుందాగ వ్యవహరించాలని, వ్యక్తిగతమైన విమర్శలు (Personal Criticism), ఆరోపణలు చేస్తే మర్యాద ఉండదని హెచ్చరించారు.
"మహబూబ్‌నగర్ పార్లమెంట్ ఎన్నికపై రేవంత్ రెడ్డి ఓటమి ఒప్పుకున్నారు. అందుకే నాపై వ్యక్తిగత దాడికి పాల్పడుతున్నారు. ఒక మహిళ అనే గౌరవం లేకుండా, దొరసాని అని నోటికి వచ్చినట్లు ఒక సీఎం మాట్లాడటం సిగ్గుచేటు. ఈ మాట అన్నందుకు మీరు కచ్చితంగా నాకు క్షమాపణ చెప్పాలి. ఇది ఇలానే కొనసాగితే ఊరుకోవటానికి డీకే అరుణ సిద్ధంగా లేదు."- డీకే అరుణ, మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి