DK Aruna challenge to CM Revanth : మహబూబ్‌నగర్‌లో చల్లా వంశీచంద్ రెడ్డి నామినేషన్ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మహిళ అని చూడకుండా రేవంత్ నీచంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఇవాళ మహబూబ్‌నగర్‌లోని తన నివాసంలో ఆమె మాట్లాడారు. తనను ఎదుర్కొనేందుకు గుంపులుగా వచ్చి, ముప్పేట దాడి చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ ఇచ్చిన అరు గ్యారంటీలపై మాట్లాడకుండా రేవంత్ రెడ్డి పాలమూరుకు వచ్చి నోటికొచ్చినట్లు తిట్టి పోతున్నారని డీకే అరుణ ధ్వజమెత్తారు. తన మనోధైర్యాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని విమర్శించారు. మహిళను పట్టుకొని దొరసాని, తొక్కుతా అని నోటికొచ్చినట్లు మాట్లాడటం ముఖ్యమంత్రి స్థాయికి తగునా అని ప్రశ్నించారు. పాలమూరు జిల్లా అభివృద్ధికి బాటలు వేసినందుకు, ప్రాజెక్టుల కోసం పోరాడినందుకు తనను తొక్కాలనుకుంటున్నారా? అని ఎదురుదాడికి దిగారు.
పాలమూరుకు ఏం చేశారో చెప్పాలి :కాంగ్రెస్ నేతలు, ముఖ్యమంత్రి ఓ మహిళను ఎలా అవమానిస్తున్నారో మహిళలు గమనించాలని అరుణ కోరారు. వచ్చే ఎన్నికల్లో అలాంటి వారికి తగిన బుద్ధి చెప్పాలన్నారు. రేవంత్ ఎమ్మెల్యే, ఎంపీగా ఉండి పాలమూరుకు ఏం చేశారో చెప్పాలన్నారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన రేవంత్ బాగోతాన్ని తానే విప్పుతానని సవాల్ విసిరారు. గద్వాల కోట గురించి, నీతి, జాతి గురించి మాట్లాడే అర్హత రేవంత్‌కు లేదన్నారు.