RRR COMMENTS ON CUSTODIAL TORTURE: చేసిన కర్మ ఎవర్నీ వదలదని ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు అన్నారు. తనను పుట్టినరోజు నాడు అన్యాయంగా అరెస్టుచేసి చిత్రహింసలు పెట్టి గుంటూరు జైలు, కోర్టుకు తరలించిన విజయ్‌పాల్ ఇప్పుడు అదే కోర్టు నుంచి నిందితునిగా జైలుకు వెళ్లాల్సిన దుస్థితి వచ్చిందని పేర్కొన్నారు. కొంత సమయం ఆలస్యమైనా తనను చిత్రహింసలకు గురిచేసిన వారందరికీ శిక్ష పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
తాను ఇచ్చిన ఫిర్యాదులో ఏ4గా ఉన్న విజయ్‌పాల్ తనను అరెస్టు చేసినప్పటి నుంచి చిత్రహింసల వరకు మొత్తం సమన్వయం చేశారని తెలిపారు. పాపం పండిందని, తనను నిర్బంధించిన సమయంలో తనకున్న సీఆర్‌పీఎఫ్ సిబ్బందిని సైతం బయటకు పంపారని గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఓ మహిళా అధికారి వాళ్లను గది బయట కూడా ఉండకుండా హోటల్‌కు వెళ్లిపోవాలని సూచించారని వెల్లడించారు. ఒక ఐపీఎస్, ఒక ఏఎస్పీ ర్యాంకు అధికారి, సునీల్‌కుమార్‌తో పాటు అసలు కుట్రదారు సీతారామాంజనేయులు, ఆపై వ్యక్తుల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో నమోదుచేశామన్నారు.
దయనీయమైన స్థితిలో విజయ్‌పాల్ - బిక్కుబిక్కుమంటూ జైలులో
ఏం రాజు గారూ ఇలా చేశారని అడిగారు:సునీల్‌నాయక్ అనే ఐపీఎస్ అధికారి బిహార్ క్యాడర్ నుంచి వచ్చి తిరిగి బిహార్‌కు వెళ్లిపోయారని తెలిపారు. రఘురామరెడ్డి అనే వ్యక్తి సైతం ఈ కుట్రలో ఉన్నారని అన్నారు. రెండురోజుల ముందు జరిగిన అంతర్గత చర్చల్లో ఆయన కూడా పాల్గొన్నారని, చంద్రబాబు సహా అందరినీ వేధించిన వ్యక్తి రఘురామరెడ్డి అనే విషయం అందరికీ తెలుసని పేర్కొన్నారు. వీరందరూ చేసిన కుట్రను అమలుచేసిన కీలక నిందితుడు విజయ్‌పాల్ అని వెల్లడించారు. తన భద్రతా సిబ్బందిని బయటకు పంపించిన తరువాత అక్కడ ఉంచిన సత్యనారాయణ అనే సీఐ, మీరావలి అనే హెడ్ కానిస్టేబుల్‌ను కిందికి పిలిచి, అనంతరం ముసుగు వ్యక్తులను పంపించి తనను దారుణంగా కొట్టించారని రఘురామ తెలిపారు. ఆ ముసుగు వ్యక్తులు వెళ్లిపోయిన తర్వాత ఆ సీఐ, హెడ్‌కానిస్టేబుల్ తన గదిలోకి వచ్చి విరిగిపోయిన మంచాన్ని చూసి ఏమీ తెలియనట్లు ఏం రాజు గారూ ఇలా చెల్లాచెదురు చేశారని అడిగారన్నారు. కర్మ ఎవర్నీ వదిలిపెట్టదని రఘురామ అన్నారు.