Pawan Kalyan visit IS Jagannathapuram:ఎన్నికల్లో చెప్పినట్లే పథకాలు అమలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ దీపం పథకం కింద ఉచిత సిలిండర్లు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురం గ్రామంలో పర్యటించారు.
జనసైనికులు రౌడీయిజాన్ని ఎదిరించారు:జనసైనికులు ఎర్రకండువాతో రోడ్డుపైకి వచ్చి వైఎస్సార్సీపీ రౌడీయిజాన్ని ఎదిరించారని పవన్ కల్యాణ్ కొనియాడారు. కూటమి విజయంలో జనసైనికుల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. త్వరలో డిజిటల్ ప్రైవసీ యాక్ట్ అమలు చేస్తామని వివరించారు. వైఎస్సార్సీపీ నాయకులకు చింతచచ్చినా పులుపు చావలేదన్నారు. కూటమి నాయకులు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ కావాలనే ఘర్షణలు సృష్టించి మనల్నే తిట్టేందుకు ప్రయత్నిస్తారని తెలిపారు.
వైఎస్సార్సీపీకి చింత చచ్చినా పులుపు చావలేదు - ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకోం: పవన్‌కల్యాణ్ (ETV Bharat) మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదు:వైఎస్సార్సీపీని ప్రజలు తరిమికొట్టినా, కేవలం 11 సీట్లకే పరిమితమైనా వారి నోళ్లు ఆగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని తెలిపారు. సామాజిక మాధ్యమాల ద్వారా ఏది పడితే అది మాట్లాడుతాం అంటే మాత్రం చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. మాది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదని జగన్ అనుచరులు గుర్తు పెట్టుకోవాలని అన్నారు. సోషల్ మీడియాలో ఆడబిడ్డలను ఇబ్బంది పెట్టే విధంగా పోస్టులు పెడుతున్నారని ప్రభుత్వం ప్రతి విషయాన్ని గమనిస్తోందని వివరించారు. ఆడబిడ్డల భద్రత విషయంలో ఏమాత్రం తేడా వచ్చినా తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటామని పవన్ అన్నారు.
కొండపల్లి కళాకారులకు పవన్ శుభవార్త - ఆ చెట్లు పెంచడానికి ప్రణాళికలు సిద్ధం
అధికారులదే బాధ్యత: పాఠశాలలు, కళాశాలలు, వసతి గృహాల్లో ఆడబిడ్డల బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. ఇకపై తప్పు చేసిన వారిపై కఠిన నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకువస్తే సహించేది లేదని అన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ విభాగం ప్రారంభిస్తున్నామని తెలుగు రాష్ట్రాల్లో నారసింహ వారాహి గళం పేరుతో ఈ విభాగం ఉంటుందని పవన్ కల్యాణ్ అన్నారు.
షర్మిలకు రక్షణ కల్పిస్తాం:జగన్ సోదరి షర్మిల నా ప్రాణాలకు రక్షణ కావాలి అదనంగా సెక్యూరిటీ కల్పించాలని అడిగారని పవన్ అన్నారు. జగన్ మీకు కల్పించలేకపోయాడేమో కానీ మీ ప్రాణాలకు కూటమి ప్రభుత్వం రక్షణగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఒక బాధ్యతగల నాయకురాలిగా మీరు ఎన్ని విమర్శలైనా చేయొచ్చని అన్నారు. మీరు రక్షణ కోసం అప్పీల్ చేసుకోండి సీఎం దృష్టికి తీసుకెళ్లి మీకు రక్షణ కల్పించే బాధ్యత తీసుకుంటామని పవన్ హామీ ఇచ్చారు.
ఆలయంలో పూజలు: అంతకుముందు జగన్నాథపురం చేరుకున్న పవన్ సుందరగిరి పర్వతంపై వెలసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న పవన్‌కు మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు మద్దిపాటి వెంకటరాజు, పత్సమట్ల ధర్మరాజు, బొలిశెట్టి శ్రీనివాస్, జిల్లా అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ముందుగా ఆలయ యాగశాలలో నిర్వహించిన సుదర్శన నరసింహ ధన్వంతరి గరుడా ఆంజనేయ సుబ్రహ్మణ్య అనంత హోమంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. అనంతరం స్వామి వారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత వేద పండితులు ఆయనకు వేద ఆశీర్వచనంతో పాటు స్వామి వారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం కొండపై ఉన్న ఆలయ అతిథి గృహంలో దేవాదాయ శాఖ కమిషనర్, జిల్లా కలెక్టర్, జిల్లా మైనింగ్ అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు.
విజయ్ పొలిటికల్ ఎంట్రీ - పవన్ కల్యాణ్ మనసులో మాట ఏమిటంటే!
డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు - సరస్వతి పవర్ భూముల్లో అధికారుల సర్వే