Deputy CM Pawan Kalyan Video Conference:రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 23 నుంచి పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించనున్నట్లు ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టే పనుల్ని గ్రామ సభల్లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించారు. సచివాలయం నుంచి ఎంపీడీఓలు, జెడ్పీసీఈవోలతో డిప్యూటీ సీఎం వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించారు. గ్రామసభల నిర్వహణ విధి విధానాలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
గ్రామీణ ఉపాధి హామీ పనులపై సోషల్ ఆడిట్ పకడ్పందీగా వ్యవహరించాలని డిప్యూటీ సీఎం సూచించారు. ఉపాధి హామీ పథకం పరిధిలో 46 రకాలైన పనులు చేపట్టేందుకు అవకాశం ఉందని, ప్రజలకు ఉపయుక్తంగా ఉండే పనులు చేపట్టేలా గ్రామ సభల్లో చర్చించాలన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా వేల కోట్ల రూపాయల నిధులు వెచ్చిస్తున్నామని డిప్యూటీ సీఎం స్పష్టం చేశారు. ప్రతీ రూపాయి బాధ్యతతోనే వ్యయం చేయాలని అన్నారు. ఉపాధి హామీ పథకం లక్ష్యాలను సాధించాలన్నారు. జిల్లా స్థాయి అధికారుల నుంచి, మండల, గ్రామ స్థాయిలో ఉన్న అధికారులు ఈ పథకం పనులు అమలుపై బాధ్యత తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.