Bhatti Vikramarka Key Comments on Implementation of Rythu Bharosa : రైతు భరోసా పథకం అమలు, విధి విధానాలకు సంబంధించి అన్నదాతల సలహాలు, సూచనలు తీసుకునేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలో ఉమ్మడి వరంగల్ జిల్లా విస్తృత స్థాయి సమావేశం హనుమకొండ కలెక్టరేట్లో జరిగింది. మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అధికారులు, రైతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతు భరోసా పథకం ఎలా ఉంటే అందరికీ ప్రయోజనంగా ఉంటుందన్న దానిపై అన్నదాతల నుంచి సలహాలు స్వీకరించారు.
ఈ సందర్భంగా తమది ప్రజా ప్రభుత్వం అన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అందరి అభిప్రాయాలు తీసుకోవడానికే రాష్ట్రవ్యాప్తంగా రైతులతో కార్యశాలలు నిర్వహిస్తున్నామని తెలిపారు. పన్ను రూపంలో ప్రజలు ప్రభుత్వానికి కట్టే ప్రతి రూపాయి, తిరిగి ప్రజలకే చెందాలన్నదే తమ అభిమతమని పేర్కొన్నారు. ప్రజల అభిప్రాయాలే జీవోగా వస్తుందని, శాసనసభలో చర్చించి, అందరి అభిప్రాయలను తీసుకుని, చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఆగస్టులోనే రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. గతంలో రైతులు పంట నష్టపోతే సాయం అందలేదని, కానీ తమ ప్రభుత్వం అన్నదాతలకు రూ.10 వేలు ఇచ్చి ఆదుకుందని తెలిపారు. పంట నష్టం జరిగితే ప్రతి ఒక్క రైతుకూ పంట బీమా రావాలన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో బీమా పథకం వర్తింపజేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.