Chintamaneni Fires on YSRCP : ఏలూరు జిల్లా వట్లూరులో బుధవారం రాత్రి టీడీపీ, వైఎస్సార్సీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఓ వివాహ కార్యక్రమానికి దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాజరై తిరిగివస్తున్న సమయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఎమ్మెల్యే కారును వెళ్లనివ్వకుండా వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకునే ప్రయత్నం చేశారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ఘర్షణ రాత్రి చింతమనేని నివాసానికి తెలుగుదేశం పార్టీ నేతలు, క్యాడర్ భారీగా చేరుకున్నారు.
ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మాట్లాడారు. దెందులూరు నియోజకవర్గంలో గొడవలకు వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపించారు. తన కారును వెళ్లనివ్వకుండా వైఎస్సార్సీపీ నేతలు అడ్డుకున్నారని తెలిపారు. ఎదురుగా వేరే కారు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేశారని చెప్పారు. సెక్యూరిటీ వాళ్లు చెబుతున్నా వినిపించుకోలేదని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరే దగ్గరుండి కారు అడ్డు పెట్టించారని ఆక్షేపించారు.
High Tension in Denduluru : ఈ ఘటనను ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని చింతమనేని ప్రభాకర్ చెప్పారు. టీడీపీ నాయకులు, శ్రేణులు సంయమనం పాటించాలని సూచించారు. పోలీసులు 24 గంటల్లో చర్యలు తీసుకుంటామని చెప్పినట్లు తెలిపారు. మన నాయకుడు గీసిన గీత దాటకుండా వ్యవహరించాలని ఆయన పేర్కొన్నారు. మరోవైపు వట్లూరులో జరిగిన ఘర్షణపై ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్‌కు చింతమనేని ఫిర్యాదు చేశారు. పార్టీ సమన్వయ కమిటీతో కలిసి ఎస్పీకి ఫిర్యాదు ఇచ్చారు.