Congress Focus on Malkajgiri Constituency :మల్కాజిగిరి, దేశంలోనే అత్యధిక ఓటర్లున్న పార్లమెంట్ నియోజకవర్గం. 37.28 లక్షల ఓటర్లున్న ఈ నియోజకవర్గంలో, కాంగ్రెస్ అభ్యర్థి పట్నం సునీతా మహేందర్ రెడ్డిని లక్షకుపైగా భారీ మెజారిటీతో గెలిపించడానికి పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా బీఆర్ఎస్, బీజేపీ అసంతృప్త నేతలను పార్టీలోకి చేర్చుకొని ఓటింగ్ శాతం పెంచుకోవాలని వ్యూహాలు రూపొందించారు. పట్టణ ప్రాంతంలో ఓట్లు పొందాలని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలలో బీజేపీ, బీఆర్ఎస్ నాయకులతో సంప్రదింపులు నిర్వహిస్తూ కండువాలు కప్పుతున్నారు.
Congress Master Plan on Malkajgiri :మల్కాజిగిరి లోక్‌సభ స్థానానికి చెందినకుత్బుల్లాపూర్, మేడ్చల్, ఎల్బీనగర్ శాసనసభ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలను కాంగ్రెస్ నేతలు లక్ష్యంగా చేసుకున్నారు. వీరితోపాటు కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నాలు తీవ్రతరం చేశారు. పట్టణ ప్రాంతాల్లోని ఓటర్లను ప్రభావితం చేసే కార్పొరేటర్లు, కౌన్సిలర్లతో కాంగ్రెస్ నాయకులు తరచుగా సంప్రదింపులు చేస్తున్నారు. కొద్దిరోజుల కిందట జవహర్‌నగర్ కార్పొరేషన్ నేతలు కాంగ్రెస్‌లోకి చేరగా, మేడ్చల్, ఘట్‌కేసర్ పురపాలికల నాయకులు సైతం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
ఘట్‌కేసర్ మున్సిపల్ ఛైర్‌పర్సన్ పావనీ యాదవ్, మేడ్చల్ మున్సిపల్ వైస్ ఛైర్మన్‌లు ఇటీవల హస్తం కండువా కప్పుకొన్నారు. తాజాగా పిర్జాదీగూడ కార్పొరేషన్‌కు చెందిన పదిమంది కార్పొరేటర్లు హస్తంపార్టీలోకి చేరారు. మరోవైపు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఉపఎన్నికలోనూ విజయమే లక్ష్యంగా ఇతర పార్టీల నాయకులను పార్టీలోకి రావాల్సిందిగా కాంగ్రెస్‌నేతలు ఆహ్వానిస్తున్నారు. బోర్డు ఉపాధ్యక్షుడిగా వ్యవహరించిన జంపన ప్రతాప్‌ను కాంగ్రెస్‌లోకి చేర్చుకున్నారు.