Congress MP Candidates Meet CM Revanth :కాంగ్రెస్ నుంచి లోక్‌సభకు టికెట్ ఖరారయిన అభ్యర్థులు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిని (CM Revanth) మర్యాదపూర్వకంగా కలిశారు. జహీరాబాద్ లోక్‌సభ అభ్యర్థి సురేశ్ షెట్కార్, మహబూబ్‌నగర్ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి, మహబూబాబాద్ అభ్యర్థి బలరాం నాయక్‌లు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఇటీవల కాంగ్రెస్ అధిష్ఠానం 39 మంది అభ్యర్థులతో ప్రకటించిన మొదటి జాబితాలో తెలంగాణ నుంచి నాలుగు లోక్‌సభ స్థానాల అభ్యర్థుల పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే.
Telangana Congress MP Candidates 2024 :ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ఎంపీ అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. పోటీ చేసేవారుక్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ది పథకాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పేర్కొన్నారు. అమలు చేస్తున్న నాలుగు గ్యారంటీల్లో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపు, ఉద్యోగ నియామకాలకు పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ల జారీ, మెగా డీఎస్సీ ప్రకటన తదితర అంశాలను ప్రజలకు వివరించాలని సీఎం సూచించారు.
Lok Sabha polls 2024 : మరోవైపు కాంగ్రెస్ అధిష్ఠానం ఇంకా 13 లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. రెండో జాబితా కోసం ఆశావహులంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ స్థానాల్లో వరంగల్ ఎస్సీ రిజర్వుడ్ స్థానం నుంచి దొమ్మాటి సాంబయ్య, ఇందిరతో పాటు అద్దంకి దయాకర్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. నాగర్‌కర్నూల్ టికెట్ తనకే వస్తుందని మాజీ ఎంపీ మల్లు రవి ధీమాతో ఉన్నారు.
Cong on Parliament Elections 2024 : ఖమ్మం నుంచి ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు పొంగులేటి, తుమ్మల కుటుంబ సభ్యులు టికెట్లు ఆశిస్తుండగా, ఇక్కడ అభ్యర్థి ఎంపికపై అధిష్ఠానం తీవ్ర కసరత్తులు చేయాల్సి వస్తోంది. ఖమ్మం నుంచి పోటీ చేయాలనుకున్నవీహెచ్(VH) పోటీ తీవ్రంగా ఉన్నందున తప్పుకున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్ నుంచి ఏఐసీసీ హామీ మేరకు ప్రవీణ్‌రెడ్డికి టికెట్ ఇవ్వాల్సి ఉంది. ఇక్కడి నుంచి వెలిచల రాజేంద్రరావు తనకు టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. పెద్దపల్లి నుంచి ఎమ్మెల్యే గడ్డం వివేక్ తనయుడు వంశీ ఆశిస్తుండగా, ఆయనకు ఇవ్వొద్దంటూ నలుగురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు.