YSRCP Candidates Selection : అంతా గజిబిజి, గందరగోళంలా ఉంది వైఎస్సార్సీపీ అభ్యర్థుల ఎంపిక తీరు! నియోజకవర్గాల సమన్వయకర్తల పేరుతో రాబోయే ఎన్నికలకు అభ్యర్థులను మారుస్తున్న జగన్ చేష్టలతో ఆ పార్టీ నేతలు సైతం అయోమయంలో పడుతున్నారు. వైకుంఠపాళిలో నిచ్చెన ఎక్కినట్లే సమన్వయకర్తగా పదవినిస్తారు. ఆ వెంటనే పాము నోట్లో పడ్డట్లుగా తొలగించేస్తారు. ఇదీ పార్టీలో జరుగుతున్న తంతు. ఇక్కడ వారిని అక్కడకు, అక్కడ వారిని ఇక్కడకు మారుస్తున్నారు. తర్వాత వీరిలో కొందరినీ మరోచోటుకు ఈ మధ్యలో కొందరి టికెట్లు చిరిగిపోతున్నాయి. ఏ నియోజకవర్గంలో ఏ రోజు ఎవరు పార్టీ సమన్వయకర్తగా ఉన్నారనేదీ ఎప్పటికప్పుడు జాబితాలను సరిచూసుకుని మరీ ఖరారు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మార్చిన జాబితాలనే మళ్లీ మారుస్తుండడం ఆ పార్టీలో నెలకొన్న అస్థిరతను చాటుతోంది. అభ్యర్థుల సీట్లతో పెద్దలు ఆడుతున్న ఈ వికృత క్రీడలో అత్యధికంగా బలహీన వర్గాల నేతల బలవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ నియోజకవర్గానికి ఎవరు పోటీలో నిలుస్తారనేది చెప్పడం కష్టమనే మాట వినిపిస్తోంది.
జగన్ పిలుపుతో నేతల గుండెల్లో పిడుగు - ఈ సారి కరివేపాకులు ఎవరో?
175కి 175 అసెంబ్లీ సీట్లు, 25కి 25 ఎంపీ సీట్లు కొట్టాలంటున్న జగన్ వైనాట్ కుప్పం(Why not Kuppam) అంటూ పదే పదే బీరాలు పోతున్నారు. కానీ, తన పార్టీలోనే అభ్యర్థుల ఎంపికలో మాత్రం ఆ ఆత్మవిశ్వాసం ప్రదర్శించలేకపోతున్నారు. ఎవరిని ఎక్కడ ఎందుకు ఎంపిక చేస్తున్నారు? మళ్లీ ఎందుకు మార్చేస్తున్నారనే విషయం అర్థంకాక ఆ పార్టీ నేతలే తలలు పట్టుకుంటున్నారు. సామాజిక సమీకరణాలంటూ అధిష్ఠానం నెలల తరబడి చేస్తున్న కసరత్తు అత్తెసరుగా మారిందని వాపోతున్నారు.
తిరుపతి ఎంపీ గురుమూర్తిని సత్యవేడుకు, సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం(Adimulam)ని తిరుపతి లోక్‌సభకు మొదట మార్చగా ఎమ్మెల్యే వ్యతిరేకించడంతో ఎంపీని మళ్లీ తిరుపతికే తెచ్చారు. ఈ క్రమంలో ఎమ్మెల్యేకి టికెట్ ఎగరగొట్టేసి సత్యవేడులో కొత్త వ్యక్తిని నియమించారు. ఇదే తరహాలోనే చిత్తూరు ఎంపీ రెడ్డప్పను గంగాధర నెల్లూరుకు, అక్కడున్న ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామిని చిత్తూరు లోక్‌సభకు మార్చారు. నారాయణ స్వామి ఎదురుతిరగడంతో మళ్లీ ఎవరి స్థానాలకు వారిని మార్చారు. ఇక ఇద్దరు ఎవరి నియోజకవర్గాల్లో వారు పని చేసుకుంటుంటే మళ్లీ గంగాధర నెల్లూరు నుంచి నారాయణ స్వామిని తప్పించేసి, ఆయన కుమార్తె కృపాలక్ష్మిని సమన్వయకర్తగా నియమించారు.