South Coastal Railway zone : విశాఖ కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో వాల్తేరు డివిజన్‌ను పూర్తిగా లేకుండా చేయడం సరికాదంటూ కేంద్రంపై కూటమి ప్రభుత్వ చేసిన ఒత్తిడి ఫలించింది. తాజాగా విశాఖపట్నం డివిజన్ ఏర్పాటుకు రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు కొత్త జోన్‌లో విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు మాత్రమే ఉండేలా డీపీఆర్ సిద్ధమవుతోంది. తాజా నిర్ణయంతో ఇందులో విశాఖపట్నం డివిజన్ కూడా చేరనుంది. ఈ మేరకు ముసాయిదా డీపీఆర్ సిద్ధం చేయాలని జోన్ ప్రత్యేక అధికారికి ఆదేశాలు వెళ్లాయి. తుది డీపీఆర్‌పై బోర్డు ఇంకా నిర్ణయం తీసుకోవాలి. దాదాపు ముసాయిదా డీపీఆరే ఖరారయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
వాల్తేరు డివిజన్‌లో ఉన్న ఒడిశా రాష్ట్ర పరిధిలోని ప్రాంతానికి రాయగడ కేంద్రంగా ఇప్పటికే కొత్త డివిజన్ ఏర్పాటు చేశారు. మిగిలిన భాగమంతా విజయవాడ డివిజన్ పరిధిలోకి వచ్చేలా డీపీఆర్ సిద్ధం చేస్తూ వచ్చారు. తాజాగా పలాస-విశాఖపట్నం-దువ్వాడ, కూనేరు-విజయనగరం-నౌపడ-పర్లాఖెముండి, బొబ్బిలి-సాలూరు, సింహాచలం నార్త్-దువ్వాడ బైపాస్, వడ్లపూడి-దువ్వాడ, విశాఖపట్నం స్టీల్‌ప్లాంట్- జగ్గయ్యపాలెం సెక్షన్లు కలిపి మొత్తం 410 కిలోమీటర్లతో విశాఖపట్నం డివిజన్ కొత్తగా ఏర్పాటు చేయనున్నారు. కొత్తవలస-బచేలి టూ కిరండోల్, కూనేరు- తెరువలి, సింగ్‌పూర్‌రోడ్-కోరాపుట్, పర్లాఖెముండి-గుణుపూర్ సెక్షన్లు కలిపి 680 కిలో మీటర్ల రాయగడ డివిజన్ పరిధిలోకి వెళ్తాయి. ఈ డివిజన్ తూర్పు కోస్తా రైల్వే జోన్ పరిధిలోకి వస్తుంది.
దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు బదలాయింపు : మొన్నటి వరకు విశాఖ కేంద్రంగా ఉండే దక్షిణ కోస్తా రైల్వే జోన్‌లో విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లు మాత్రమే ఉంటాయని రైల్వే శాఖ పేర్కొంది. తాజాగా విశాఖపట్నం డివిజన్‌తో కలిపి నాలుగు డివిజన్లు ఉంటాయి. సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్ డివిజన్లు ఉంటాయి. తూర్పు కోస్తా రైల్వే జోన్‌లోకి ఖుర్దారోడ్, సంబల్‌పూర్, రాయగడ డివిజన్లు ఉన్నాయి. దక్షిణ కోస్తా రైల్వే జోన్ నుంచి 250 కిలోమీటర్లను దక్షిణ మధ్య రైల్వే జోన్‌కు బదలాయిస్తున్నారు. అలాగే దక్షిణ మధ్య జోన్‌లోని 46 కిలోమీటర్లు దక్షిణ కోస్తా జోన్‌కు తీసుకొస్తున్నారు.
గుంతకల్లు డివిజన్‌లోని రాయచూరు-వాడి మధ్య 108 కిలోమీటర్ల సెక్షన్‌ను దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని సికింద్రాబాద్ డివిజన్‌కు బదలాయించనున్నారు. దక్షిణ మధ్య, దక్షిణ కోస్తా, మధ్య రైల్వే జోన్లకు ఇంటర్‌ఛేంజ్ పాయింట్‌గా వాడి సెక్షన్ ఉంది. సికింద్రాబాద్ డివిజన్ నుంచి రాయచూరు-వాడి సెక్షన్‌లో ఉన్న యడ్లపూర్, ఎర్మరాస్ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు భారీగా బొగ్గు రవాణా చేస్తుంటారు. దీంతో ఈ సెక్షన్‌ను సికింద్రాబాద్ డివిజన్‌కు బదలాయించారు. ఏపీ- తెలంగాణ పరిధిలోని విష్ణుపురం- పగడిపల్లి, విష్ణుపురం- జన్‌పహాడ్ మార్గాల్లోని 142 కిలోమీటర్ల ఇప్పటి వరకు గుంటూరు డివిజన్ పరిధిలో ఉండేవి.
Vizag Railway Zone Updates : సింగరేణి బొగ్గు గనుల నుంచి విష్ణుపురం మీదుగా యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి బొగ్గు రవాణాకు ఈ మార్గాలను వినియోగిస్తున్నారు. దీంతో వీటిని సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోకి మారుస్తున్నారు. విజయవాడ శివారులోని కొండపల్లి- మోటుమర్రి సెక్షన్ 46 కిలోమీటర్లు ఇప్పటి వరకు సికింద్రాబాద్ డివిజన్‌లో ఉండేవి. నార్ల తాతారావు విద్యుత్ కేంద్రం, రాయనపాడు వర్క్‌షాప్‌లు దక్షిణ మధ్య, దక్షిణ కోస్తా రైల్వే జోన్ల సరిహద్దులో ఉండగా, వీటిని పూర్తిగా దక్షిణ కోస్తా జోన్‌లోకి తెచ్చేందుకు వీలుగా ఆ 46 కిలోమీటర్లు విజయవాడ డివిజన్‌లోకి బదలాయిస్తున్నారు.
తాజా ఆదేశాలతో విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు డీపీఆర్‌లో మార్పుచేర్పులు చేయనున్నారు. విశాఖపట్నంలో జోన్ కార్యాలయాల నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ గత నెలలో శంకుస్థాపన చేశారు. ఇప్పుడు డీపీఆర్ సిద్ధమైతే పూర్తిస్థాయిలో దీని పరిధిలోకి ఎంత లైన్ కిలోమీటర్లు, ఎంత ట్రాక్ కిలోమీటర్లు వస్తుంది, ఏయే స్టేషన్లు ఉంటాయనే వివరాలన్నీ ఉండనున్నాయి. దీని ఆధారంగా సిబ్బంది కేటాయింపు వంటి వాటిపై నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇప్పటి వరకు వాల్తేరు డివిజన్‌కు ఉన్న డీఆర్‌ఎం ఇకపై విశాఖపట్నం డివిజన్ డీఆర్‌ఎంగా మారుతారు. అలాగే దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు త్వరలో జనరల్ మేనేజర్‌ను కూడా నియమించనున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకు వాల్తేరు డివిజన్‌కు సరకు రవాణా ద్వారా ఏటా వచ్చే రూ.10,000ల కోట్ల రాబడిలో దాదాపు సగం విశాఖపట్నం- కిరండోల్ మార్గంలోని ఇనుప ఖనిజ రవాణా ద్వారా వస్తోంది. బచేలి టూ కిరండోల్ నుంచి ఇనుప ఖనిజం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, నౌకాశ్రయానికి గూడ్స్ రైళ్లలో రవాణా చేస్తుంటారు. ఈ మార్గం ఆంధ్రప్రదేశ్‌తోపాటు, ఒడిశా, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల పరిధిలో ఉంది. ఇలాంటి కీలకమైన మార్గంలో కొత్తవలస నుంచి బచేలి టూ కిరండోల్ వరకు ఉన్న సెక్షన్‌ను రాయగడ డివిజన్‌కు బదలాయించారు. దీనివల్ల కొత్తగా ఏర్పాటవుతున్న విశాఖ డివిజన్ భారీగా ఆదాయం కోల్పోవాల్సి వస్తుంది.
జోన్ కల సాకారమవుతోంది : విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని దశాబ్దాలుగా డిమాండ్ ఉంది. 2014లో రాష్ట్ర విభజన సమయంలో ఈ జోన్ ఏర్పాటు చేయనున్నట్లు విభజన హామీల్లో పేర్కొన్నారు. ఐదేళ్లపాటు అప్పటి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఫిబ్రవరి 27న విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అయితే ఇందులో వాల్తేరు డివిజన్ తొలగించేలా తర్వాత ప్రతిపాదన సిద్ధం చేశారు. గత నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ జోన్ కార్యాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. తాజాగా ఈ జోన్‌కు సరిహద్దులతో సహా మార్పుచేర్పులతో డ్రాఫ్ట్ డీపీఆర్ రూపొందించాలని ఆదేశాలు రావడంతో త్వరలోనే విశాఖ జోన్ కార్యరూపం దాల్చనుంది.
ఏపీలో రైల్వే అభివృద్ధికి రూ.9,417 కోట్లు - మరిన్ని నమోభారత్, వందేభారత్ రైళ్లు: అశ్విని వైష్ణవ్
ఏపీలోని రైల్వే ప్రాజెక్టులకు భారీగా నిధులు - నాలుగేళ్లలో అమరావతికి రైల్వే లైన్