Complaint to Governor for Justice to Kodikatti Srinu: తన కుమారుడు ఐదేళ్లుగా జైలులోనే మగ్గుతున్నాడని, సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెబితే న్యాయం జరుగుతుందని కోడికత్తి శ్రీను తల్లి, సోదరుడు అఖిల పక్ష నేతలతో కలిసి గవర్నర్కు విన్నవించారు. భారతదేశ న్యాయవ్యవస్థలో ఇటువంటి కేసు ఎక్కడా లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య వెల్లడించారు. అర సెంటీమీటర్ గాయం కేసులో 5 ఏళ్లుగా జైలులో జనపల్లి శ్రీనివాస్ మగ్గుతున్నాడన్నారు. జగన్ ను హత్యచేసే ఉద్దేశం జనపల్లి శ్రీనివాసరావుకు లేదన్నారు. ఎయిర్ పోర్టులోకి కోడికత్తి ఎలా వచ్చిందో అందరికీ తెలుసన్నారు. రాష్ట్రంలో దళితులు, మైనార్టీలపై జరిగిన దాడులు, అఘాయిత్యాలు, దౌర్జన్యాలు గవర్నర్ కు వివరించామని సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు పాలేటి మహేశ్ తెలిపారు. కోడికత్తి కేసులో 5 ఏళ్లుగా నిందితుడు జనపల్లి శ్రీనివాసరావును బయటికి రాకుండా ఇబ్బంది పెడుతున్నారు. దళితులకు చెందిన 27 పథకాలు రద్దు చేసిన అంశాన్ని గవర్నర్ కు తెలియజేశామని వెల్లడించారు.
ఐదేళ్లైనా తెగని కేసు - న్యాయం కోసం జైల్లోనే నిందితుడి దీక్ష, తల్లి, సోదరుడు సైతం
కోడికత్తి శ్రీను కేసులో జగన్ ఎంతో అన్యాయం చేస్తున్నారని జనసేన నగర అధ్యక్షుడు పోతిన మహేశ్ మండిపడ్డారు. కోర్టుకు వచ్చి జగన్ ఎందుకు సాక్ష్యం చెప్పడం లేదని ప్రశ్నించారు. గొడ్డలితో వివేకాను హత్య చేసిన వారికి బెయిల్ వచ్చింది. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన అనంత్ బాబుకు బెయిల్ వచ్చింది. కానీ చిన్న గాయం కేసులో జనపల్లి శ్రీనివాసరావు కు మాత్రం బెయిల్ రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సానుభూతి కోసం జగన్ జనపల్లి శ్రీనివాసరావు జీవితం జైలు పాలు చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రాజకీయ చదరంగంలో జనపల్లి శ్రీనివాసరావు జీవితం బలైపోయిందన్నారు. శ్రీనివాసరావు బయటికి వస్తే జగన్ డ్రామా బయటకు వస్తుందని, అందుకే జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పడానికి భయపడుతున్నాడన్నారు.
కోడికత్తి శ్రీను బెయిల్ కోసం పోరాటానికి సిద్ధమవుతున్న దళిత సంఘాలు