CM Revanth Reddy Delhi Tour :ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ ముగిసింది. ఈ సమావేశం గంటకుపైగా జరిగింది. రాష్ట్రానికి అన్ని రకాలుగా సాయం అందించాలని ప్రధానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర బడ్జెట్లోనూ రాష్ట్రానికి కేటాయింపులు లేవని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు నిధులు ఇవ్వాలని పీఎంను ముఖ్యమంత్రి రేవంత్ కోరారు. మూసీ నది ప్రక్షాళనకు కేంద్రం సహకరించాలని, రాష్ట్రంలోని చెరువుల పునరుద్ధరణకు ఆర్థికసాయం చేయాలని ప్రధానిని సీఎం కోరారు.
సెమీ కండక్టర్లకు సంబంధించిన ప్రాజెక్టులను తెలంగాణకు :ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి ఐదు ప్రధానాంశాలపై విజ్ఞప్తి చేశారు. అందులో మొదటగా మెట్రో విస్తరణకు రూ.22 వేల కోట్లు కేటాయించాలని కోరారు. రిజినల్ రింగ్ రోడ్డు కమ్ రైలు, మచిలీపట్నానికి అనుసంధానం చేస్తూ డ్రైపోర్టు నిర్మాణం, అదనంగా మరో 29 మంది ఐపీఎస్ పోస్టులు వేయాలని, రక్షణ రంగానికి సంబంధించిన ప్రాజెక్టులపై విజ్ఞప్తి చేశారు. సెమీ కండక్టర్లకు సంబంధించిన ప్రాజెక్టులను తెలంగాణకు కేటాయించాలని, మూసీ పునరుజ్జీవనకు రూ.20వేల కోట్లు ఇవ్వాలని ప్రధానిని కోరారు.
మరోవైపు ఆరు పెండింగ్ అంశాలపై రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ నోట్ ఇచ్చారు. 2016-17, 17-18 సంవత్సరం ఆవాస్ యోజన, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో 3 ప్రాజెక్టులు అమలు, దేవాదుల, బీమా, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులకు సంబంధించిన వ్యవహారంపై నోట్ ఇచ్చారు. బీబీ నగర్ ఎయిమ్స్, శంషాబాద్‌లో ఈఎస్‌ఐ ఆసుపత్రి, రెండు రైల్వే ప్రాజెక్టులపై మాట్లాడారు.
బండి సంజయ్, కిషన్ రెడ్డిలదే బాధ్యత :ఐదు విజ్ఞప్తులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపాల్సి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధికి అవసరమైన 5 కీలక ప్రతిపాదనలు ప్రధాని ముందు ఉంచినట్లు తెలిపారు. వీటిని ఆమోదం తీసుకురావాల్సిన బాధ్యత కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌పై ఉందన్నారు. కేబినెట్‌లో ఆమోదింపజేయాల్సిన కిషన్‌రెడ్డిదే అన్నారు. మెట్రో విస్తరణ ప్రాజెక్టు కేంద్రకేబినెట్ ముందుకు రాకుండా కిషన్‌రెడ్డి అడ్డుకున్నారని ఆరోపించారు. ఇవీ తెలంగాణకు లైఫ్ లైన్ ప్రాజెక్టులని తెలిపారు.