CM Revanth Reddy Interacts with Media : రాష్ట్రంలో ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేనట్లేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకేతాలు ఇచ్చారు. దిల్లీలో మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడిన ఆయన, పలు కీలక అంశాలపై స్పందించారు. మంత్రివర్గంలో ఎవరెవరు ఉండాలో అధిష్ఠానానిదే నిర్ణయమని తెలిపారు. తాను ఎవరి పేరూ సిఫారసు చేయడం లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రతిపక్ష నేతల కేసుల విషయంలో చట్ట ప్రకారమే ముందుకు వెళతామని చెప్పారు. అర్జెంట్‌గా అరెస్ట్ చేయించి, జైల్లో వేయాలనే ఆలోచన తనకు లేదన్నారు. సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా పని చేస్తున్నానన్నారు.
కులగణన ఆషామాషీగా చేసింది కాదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఎంతో జాగ్రత్తగా, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని చేశామని వివరించారు. సర్వే ప్రకారం బీసీలు 5.30 శాతం పెరిగారని చెప్పారు. లెక్కలతో సహా చూశాక బీజేపీ సభ్యుడు పాయల్ శంకర్ ఈ విషయాన్ని ఒప్పుకున్నారని వెల్లడించారు. అలాగే ముస్లిం రిజర్వేషన్లకు శాశ్వత పరిష్కారం దక్కుతుందని భావిస్తున్నానని తెలిపారు. పీసీసీ కార్యవర్గ కూర్పు కొలిక్కి వచ్చిందని, ఇందుకు సంబంధించిన విషయాలు ఒకటి, రెండు రోజుల్లో ప్రకటన ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
తాను రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ కోరలేదని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ప్రభుత్వం, పార్టీ తీసుకునే అన్ని కీలక నిర్ణయాలు అధిష్ఠానం దృష్టిలో ఉంటాయని తెలిపారు. అధిష్ఠానానికి తెలియకుండా నిర్ణయాలు ఉంటాయని తెలియని వాళ్లు అనుకుంటే చేసేదేమీ లేదని వివరించారు. పార్టీ, పార్టీ నేతల మనోభావాలకు అనుగుణంగానే నడుచుకుంటానే తప్ప, వ్యక్తిగత నిర్ణయాలు ఎప్పుడూ ఉండవన్నారు. పార్టీ ఇచ్చిన పని పూర్తి చేయడమే తన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.