తెలంగాణ

telangana

ETV Bharat / politics

విభజన అంశాలపై సర్కార్ నజర్‌ - ఆ అంశాలపై రేపటి కేబినెట్​ భేటీలో కీలక చర్చ - Bifurcation Issues Of Ts And Ap - BIFURCATION ISSUES OF TS AND AP

Congress Government Focus On TS And AP Bifurcation Issues : అపరిష్కృత విభజన అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. రెండు రాష్ట్రాల భిన్న వాదనలతో 9, 10 షెడ్యూళ్లలోని పలు సంస్థలు అపరిష్కృతంగా ఉండిపోయాయి. శనివారం నాటి రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో విభజన అంశాలపై చర్చ జరగనుంది. దీంతో ఆయా శాఖల పరిధిలో అపరిష్కృతంగా ఉన్న సంస్థలకు సంబంధించిన సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆర్థిక శాఖ అధికారులకు స్పష్టం చేసింది. ఇరు రాష్ట్రాల మధ్య సంస్థలతో పాటు పలు ఆర్థిక పరమైన అంశాలు సైతం పెండింగ్‌లోనే ఉన్నాయి.

Congress Government Focus On TS And AP Bifurcation Issues
CM Revanth Focus on Bifurcation Issues (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : May 17, 2024, 7:23 AM IST

విభజన అంశాలపై సర్కార్ నజర్‌ పలు అంశాల్లో కొలిక్కి రాని అభిప్రాయాలు (ETV Bharat)

CM Revanth Focus on Bifurcation Issues :వచ్చే నెల రెండో తేదీతో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై పదేళ్లు పూర్తవుతుంది. ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం హైదరాబాద్‌ ఉమ్మడి రాజధాని గడువు సైతం ముగియనుంది. వివిధ కార్పొరేషన్లు, సంస్థల విభజన వ్యవహారం ఇరు రాష్ట్రాల మధ్య ఇంకా కొలిక్కి రాలేదు. విభజన అంశాలపై దృష్టి సారించిన సీఎం రేవంత్‌రెడ్డి శనివారం మంత్రివర్గ సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు.

విభజన సమయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాల్లో ఆర్థికశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగాలను ఏర్పాటు చేశారు. విభజన చట్టం 9, 10వ షెడ్యూల్‌లలోని పలు అంశాలు ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్నాయి. తొమ్మిదో షెడ్యూల్‌లోని అంశాలపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన షిలాబిడే కమిటీ పలు సిఫార్సులు చేసింది. ఇందులో మొత్తం 91 కార్పొరేషన్లు ఉండగా, ఆర్టీసీ, ఎస్​ఎఫ్సీ వంటి 23 కార్పొరేషన్లపై ఇరు రాష్ట్రాల మధ్య భిన్న వాదనలు ఉన్నాయి.

విభజన చట్టంలోని హెడ్‌ క్వార్టర్స్‌ అనే పదానికి రెండు రాష్ట్రాలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేవలం సదరు కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని మాత్రమే హెడ్ క్వార్టర్స్‌గా పరిగణించాలని తెలంగాణ అంటోంది. అయితే హైదరాబాద్​లోని సదరు కార్పొరేషన్ అన్ని కార్యాలయాలు, భవనాలను హెడ్ క్వార్టర్స్‌గా పరిగణించాలని ఆంధ్రప్రదేశ్ చెబుతోంది. ఈ వివాదాన్ని ముగించేందుకు కేంద్ర ప్రభుత్వం హెడ్ క్వార్టర్స్ అన్న పదానికి స్పష్టతనిస్తూ తెలంగాణ వాదనను సమర్థించగా, ఏపీ దీన్ని అంగీకరించలేదు. ఇలా రెండు రాష్ట్రాల మధ్య వివిధ అంశాలకు సంబంధించి భిన్నమైన అభిప్రాయాలు ఉండడంతో అవి అపరిష్కృతంగానే ఉండిపోయాయి.

జూన్ 2తో ముగియనున్న ఉమ్మడి రాజధాని కాలపరిమితి - అపరిష్కృత విభజన అంశాలపై సీఎం రేవంత్​ ఫోకస్ - Telangana Cabinet Meeting May 18th

అటు పదో షెడ్యూల్‌లో మొత్తం 142 సంస్థలు ఉండగా, తెలుగు అకాడమీ లాంటి 30 సంస్థలపై ఇరు రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. విభజన చట్టం 75వ సెక్షన్ ప్రకారం స్థానికత ఆధారంగానే ఈ సంస్థలు ఆయా రాష్ట్రాలకు చెందుతాయని, అయితే నిబంధనలకు లోబడి సేవలు మాత్రం ఉపయోగించుకోవచ్చని అందులో ఉంది. కేంద్ర హోంశాఖ పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించినా ఆయా అంశాలపై ఏపీ, తెలంగాణ మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. దక్షిణాది జోనల్ కౌన్సిల్ సమావేశంలోనూ చర్చకు వచ్చినా ముందుకు కదల్లేదు.

ఈఎస్ఎల్ నరసింహన్ గవర్నర్‌గా ఉన్న సమయంలో మంత్రుల కమిటీలు ఏర్పాటు చేసి సైతం చర్చించారు. అయినా కొన్ని అంశాల్లో రెండు రాష్ట్రాలు న్యాయస్థానాలను కూడా ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు రాజ్​భవన్, హైకోర్టు, లోకాయుక్త తదితర రాజ్యాంగబద్ధ సంస్థల నిర్వహణకు సంబంధించి కూడా ఏపీ నుంచి జనాభా ప్రాతిపదికన బకాయిలు రావాలని తెలంగాణ అంటోంది. వీటితో పాటు కార్మిక సంక్షేమ నిధి, వాణిజ్య పన్నులు తదితర బకాయిలకు సంబంధించిన వివాదాలు కూడా ఉన్నాయి.

'తెలంగాణ ఆర్థిక పరిస్థితిని ప్రధానికి వివరించాం - విభజన చట్టంలో రావాల్సిన హక్కులను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది'

ఏపీ, తెలంగాణ మధ్య విభజన సమస్యలను కొలిక్కి తెచ్చేందుకు కేంద్ర హోంశాఖ వివాదాల పరిష్కార కమిటీని ఏర్పాటు చేసింది. కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి నేతృత్వంలో రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులతో ఏర్పాటైన కమిటీ, దాదాపుగా 30 వరకు సమావేశాలు నిర్వహించింది. దిల్లీలోని ఏపీ భవన్‌ విభజన వ్యవహారం వంటి కొన్ని అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది.

శనివారం మంత్రివర్గ భేటీకి అన్ని అంశాలను నివేదించే పనిలో అధికారులు పడ్డారు. అందులో భాగంగా అన్ని శాఖల నుంచి ఆర్థిక శాఖ వివరాలు కోరింది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ విభాగం ఈ మేరకు 32 శాఖలకు నోట్ పంపింది. ఆయా శాఖల్లోని కార్పొరేషన్లు, సంస్థలకు సంబంధించిన విభజన అంశాలు, వాటికి సంబంధించిన సమగ్ర వివరాలు ఇవ్వాలని స్పష్టం చేసింది. వాటి ఆధారంగా మంత్రివర్గ సమావేశానికి నివేదిక సమర్పిస్తారు.

MP Suresh Reddy Comments: '8ఏళ్లు గడిచినా విభజన చట్టంలోని హామీలు నెరవేరలేదు'

ABOUT THE AUTHOR

...view details