'కేంద్రంతో లొల్లి రాష్ట్రాభివృద్ధికి ఆటంకమే - తెలంగాణకు మోదీ పెద్దన్నలా సహకరించాలి' CM Revanth At PM Modi Adilabad Meeting Today : రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆదిలాబాద్ సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ రూ.7 వేల కోట్ల విలువైన పనులను ప్రారంభించారు. పలు అభివృద్ధి పనులకు వర్చువల్‌గా శ్రీకారం చుట్టారు. రామగుండం ఎన్టీపీసీ తెలంగాణ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. అనంతరం పలు రైల్వే అభివృద్ధి పనులు, అంబారి - పింపల్‌కుట్టి విద్యుదీకరణ ప్రాజెక్టు, డబ్లింగ్, విద్యుదీకరించిన సనత్‌నగర్ - మౌలాలి మార్గాలను లాంఛనంగా షురూ చేశారు.
PM Modi Adilabad Tour News : ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి సహకరించిన మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. విభజన చట్టం ప్రకారం 4 వేల మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉందని, గత ప్రభుత్వ నిర్ణయం వల్ల 1600 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి మాత్రమే అవుతుందని తెలిపారు. ఎన్టీపీసీకి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని స్పష్టం చేశారు.
'కేంద్రంతో ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. ఎన్నికల సమయంలోనే రాజకీయాలు చేయాలి. కంటోన్మెంట్ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి బదిలీ చేసినందుకు ప్రధానికి కృతజ్ఞతలు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి ముందుకు వెళ్తాం. దేశం 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ చేరడంలో హైదరాబాద్ కీలకపాత్ర పోషిస్తుంది. మూసీ రివర్ అభివృద్ధికి కేంద్రం సహకరించాలి. రాష్ట్రాభివృద్ధికి పెద్దన్నలా ప్రధాని మోదీ సహకరించాలి.' అని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
వెల్‌కమ్ చెప్పిన సీఎం : అంతకుముందు ఆదిలాబాద్ చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఘన స్వాగతం పలికారు. సీఎం రేవంత్ మోదీని శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి సీతక్క సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. అయితే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రధాని పర్యటనలకు ప్రభుత్వం తరఫున స్వాగతం పలికే వారు కాదు. ఇటీవల ఏర్పాటైన రేవంత్ సర్కార్ రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కేంద్రప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగించే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగానే నేడు ప్రభుత్వం తరఫున ప్రధానికి స్వాగతం పలికారు.