CM Chandrababu Review on Liquor Prices:మద్యం ధరలు, ఇసుక లభ్యత, సరఫరాపై అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కొత్త మద్యం పాలసీ అమలు విధానాన్ని సీఎంకి అధికారులు వివరించారు. మద్యం ధరల విషయంలో అధికారులకు చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మద్యం షాపుల్లో ఎవరైనా ఎంఆర్పీ ధరలకు మించి ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా ఉపేక్షించవద్దని అధికారులకు సీఎం ఆదేశించారు. ఎంఆర్పీకి మించి మద్యం అమ్మకాలు జరిపినట్లు రుజువైతే మొదటి సారి అయితే 5 లక్షలు ఫైన్ వేయాలని, తరువాత కూడా తప్పు చేస్తే సదరు షాపు లైసెన్స్ రద్దు చేయాలని అధికారులకు సీఎం ఆదేశించారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు: ఎట్టి పరిస్థితుల్లోను బెల్ట్ షాపులను అనుమతించవద్దని చంద్రబాబు అధికారులకు తేల్చిచెప్పారు. లిక్కర్ షాపుల యజమానులు ఎవరైనా బెల్ట్ షాపులను ప్రోత్సహిస్తే వారి పైన చర్యలు తీసుకోవాలని సూచించారు. బెల్ట్ షాపులకు మద్యం అమ్మే లిక్కర్ షాపులకు మొదటి సారి తప్పు చేస్తే 5 లక్షలు అపరాధ రుసుము విధించాలని, మళ్లీ నిబంధనలు ఉల్లంఘిస్తే వారి లైసెన్స్ రద్దు చేయాలని అన్నారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే మద్యంపై కఠినంగా ఉండాలన్న సీఎం, ఎన్డీపీఎల్ (Non Duty Paid Liquor) రాకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ID (illicitly distilled) లిక్కర్ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
నిధులు విడుదల - ఇవి ఉంటే చాలు ఫ్రీ గ్యాస్ మీ ఇంటికే
ఫిర్యాదుల కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ :ప్రతి షాపులో సీసీ కెమెరాలు ఉండేలా చూడాలని, ఫిర్యాదుల కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేయాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ రెండు వ్యవస్థల పర్యవేక్షణకు సెంట్రల్ మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రతి షాపు వద్ద మద్యం ధరల పట్టిక తప్పకుండా ఉండేలా చూడాలన్నారు. మద్యం షాపుల వద్ద ఆకస్మిక తనిఖీలు, మద్యం అక్రమ నిల్వలపై దాడులు చేయాలని సూచించారు. అనంతరం ఇసుక లభ్యత, సరఫరా అంశాలపై అధికారులు తాజా పరిస్థితిని వివరించారు. ఇసుక లభ్యత పెంచాలని, అన్ని రీచ్ల నుంచి ఇసుక సులభంగా తీసుకువెళ్లేందుకు అవసరమైన ఏర్పాటు చేయాలని చంద్రబాబు అన్నారు.
తప్పులు జరిగితే అధికారులపైనే చర్యలు:పొరుగు రాష్ట్రాలకు ఒక్క లారీ ఇసుక కూడా తరలిపోవడానికి వీల్లేదని అధికారులకు చంద్రబాబు స్పష్టం చేశారు. ఇసుక విషయంలో ఎక్కడైనా అక్రమాలు జరుగుతున్నట్లు తెలిస్తే మొదటగా సంబంధిత అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఇసుక విషయంలో తప్పులు జరిగితే ముందుగా అధికారులపైనే చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. మద్యం పాలసీ, ఇసుక విషయంలో ప్రభుత్వం స్పష్టమైన విధానంతో ఉందని దాన్ని క్షేత్ర స్థాయి వరకు సక్రమంగా అమలు అయ్యేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రజల జేబులు గుల్ల చేసేలా ఎవరు వ్యవహరించినా ఉపేక్షించాల్సిన పనిలేదని అధికారులకు సీఎం స్పష్టం చేశారు.
'విశాఖ- ముంబై' విమానానికి బాంబు బెదిరింపు - వెనక్కి రప్పించిన సిబ్బంది
విజయ్ పొలిటికల్ ఎంట్రీ - పవన్ కల్యాణ్ మనసులో మాట ఏమిటంటే!