CM Chandrababu on Jamili Elections : జమిలి అమల్లోకి వచ్చినా, ఎన్నికలు జరిగేది 2029లోనేనని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టంచేశారు. ఒక దేశం, ఒకే ఎన్నిక విధానానికి ఇప్పటికే తమ మద్దతు ప్రకటించామని ఆయన వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాతో ముచ్చటించారు. జమిలిపై అవగాహన లేని వైఎస్సార్సీపీ పబ్బం గడుపుకోవటానికి ఏది పడితే అది మాట్లాడుతోందని ఆయన మండిపడ్డారు.
వారి నాటకాలు చూసి నవ్వుకుంటున్నారు:వైఎస్సార్సీపీ నేతల మాటలు ప్రజల్లో ఎప్పుడో విశ్వసనీయత కోల్పోయాయన్న ఆయన, వాళ్లు చేసే డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం కొనసాగుతుందని తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం అన్నారు. విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, పాఠశాలలతోపాటు ప్రతి చోటా దీనిపై చర్చ జరగాలని, విజన్ 2020 సాకారమైన తీరు నేటి తరం తెలుసుకోవాలని అన్నారు.
భవిష్యత్ తరాల బాగు కోసం చేసే ప్రయత్నం: 1996 నాటి ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు, 2020 నాటి పరిస్థితులు బేరీజు వేస్తే విప్లవాత్మక మార్పులు అందరి కళ్లకూ కనిపిస్తున్నాయన్న సీఎం, 2047లోనూ ఇదే పునరావృతం అవుతుందని అభిప్రాయపడ్డారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ ఒకరోజు పెట్టి వదిలేసే కార్యక్రమం కాదన్న ఆయన, భవిష్యత్తు తరాల బాగు కోసం చేసే ఈ ప్రయత్నంలో అందరి భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. రేపటి తరం భవిష్యత్తు కోసమే ఈ విజన్ 2047 అని స్పష్టంచేశారు.