CM Chandrababu Naidu Chit Chat With Media :ముంబై నటి వ్యవహారంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోని పోలీసులు వ్యవహరించిన తీరు రాష్ట్ర ప్రతిష్ఠను మంటగలిపిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పు చేసిన పోలీసులు ఏ స్థాయిలో ఉన్నా క్షమించేది లేదని స్పష్టం చేశారు. మహిళలు, ఆడబిడ్డల భద్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని తేల్చి చెప్పారు. వ్యవస్థల్ని ఎంత నిర్వీర్యం చేశాడో ముంబై నటి వ్యవహారమే ఓ నిదర్శమని అన్నారు. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో జరిగిన మీడియా చిట్ చాట్లో చంద్రబాబు పలు విషయాలపై ఆయన మాట్లాడారు.
Chandrababu on Hidden Cameras in Girls Hostel : కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులోని ఇంజినీరింగ్ కళాశాలలో జరిగిన ప్రచారం పట్ల అంతా భయాందోళనలకు గురయ్యారని సీఎం అన్నారు. ప్రభుత్వం సకాలంలో స్పందించి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశానని తెలిపారు. అందరి సమక్షంలోనే ఇప్పటి వరకూ హాస్టల్ మొత్తం తనిఖీలు చేశారని చేశారు. వసతి గృహంలో ఎలాంటి పరికరాలు లబించలేదని సీఎం చెప్పారు. అయినా దర్యాప్తు ఆపకుండా, సమగ్ర విచారణ కొనసాగుతుందని వెల్లడించారు. కొన్ని ప్రచారాల పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా, ధైర్యంగా ఉండాలని సూచించారు. తప్పు చేసిన ఎవరినీ ప్రభుత్వం ఉపేక్షించదని స్పష్టం చేశారు.
చేరికలు ఉంటాయి :వైఎస్సార్సీపీలో ఇమడలేక చాలా మంది తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారని చంద్రబాబు తెలిపారు. అందరినీ కాకుండా మంచి వ్యక్తిత్వం ఉన్నవారినే చూసి తీసుకుంటామని అన్నారు. పార్టీకి, నేతలకు, కార్యకర్తలకు ఇబ్బంది లేకుండానే చేరికలు ఉంటాయని స్పష్టం చేశారు.