CM Chandrababu Instructions to Ministers:మంత్రులకు హనీమూన్ పిరియడ్ ముగిసిందని ఇక శాఖాపరమైన అంశాలపై పట్టు సాధించాలని సీఎం చంద్రబాబు హితబోధ చేశారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత రాజకీయ అంశాలపై జరిగిన చర్చలో మంత్రులకు సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై విస్తృత ప్రచారం చేసి ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం సూచించారు. అధికారులు చెప్పేవన్నీ గుడ్డిగా నమ్మొద్దని, శాఖలో ఏం జరుగుతోందో వాస్తవాలు తెలుసుకోవాలని సీఎం మంత్రులకు సూచించారు.
అధికారులు చెప్పేవన్నీ గుడ్డిగా నమ్మి బహిరంగ ప్రకటనలు చేయొద్దని చంద్రబాబు అన్నారు. అధికారులు చెప్పే సమాచారాన్ని వాస్తవ పరిస్థితిని బేరీజు వేసుకుని మాట్లాడాలని సీఎం దిశానిర్దేశం చేశారు. ఇటీవల ఒకరిద్దరు మంత్రులు గుడ్డిగా అధికారులు ఇచ్చిన తప్పులు సరిచేసుకోకుండా బహిరంగ ప్రకటన చేశారంటూ ఉదహరించారు. మంత్రివర్గ సమావేశంలో చర్చ సందర్భంగా పర్యాటక, స్పోర్ట్స్ విధానాల్లో స్థానిక ప్రతిభను ప్రోత్సహించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.